CM CBN 30 Years milestone: రాజకీయాల్లో( politics) నిలదుక్కుకోవడం అంత సులువు కాదు. పైగా ఎప్పటికప్పుడు పొలిటికల్ ట్రెండ్ మారుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా మనం మారడం.. ప్రజలను ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. కొందరు రాజకీయాల్లో ఇట్టే చేరి రాణిస్తుంటారు. పదవులు పొందుతుంటారు. అయితే అంతే వేగంగా కనుమరుగు అవుతుంటారు. కానీ ప్రతికూల పరిస్థితుల నడుమ రాజకీయాల్లోకి వచ్చి.. ఇక్కడి పరిస్థితులను అవపోషణ పట్టి చాలామంది సుదీర్ఘకాలం రాజకీయం చేస్తుంటారు. అటువంటి వ్యక్తి సీఎం చంద్రబాబు. 1978లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1983లో అదే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అటు తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989 నుంచి ఇప్పటివరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1995లో ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారు. అటు తరువాత 1999, 2014, 2024 ఎన్నికల్లో విజయం సాధించి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదేళ్లు.. నవ్యాంధ్రప్రదేశ్లో ఆరేళ్లు అధికారం చేపట్టి… అత్యధిక కాలం సీఎంగా రెండు రాష్ట్రాల్లో కూడా రికార్డ్ సొంతం చేసుకున్నారు. 1995 సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికీ 30 ఏళ్లు అవుతోంది.
పూల పాన్పు కాదు..
చంద్రబాబు( AP CM Chandrababu) రాజకీయ ఉన్నతి పూల పాన్పు కాదు. పలుమార్లు కిందకు పడిపోయారు. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నారు. అయితే పడిపోయిన ప్రతిసారి కెరటంలా ముందుకు సాగారు. సంసోబాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగారు. పాతాళానికి పడినా.. ఆకాశమే హద్దుగా ఎదగడం చంద్రబాబుకు ఉన్న తత్వం. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో రాటు తేలారు. ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా కింగ్ మేకర్ పాత్ర పోషించారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో తనకు తానే సాటి అని అనిపించుకున్నారు. సైబరాబాద్ నిర్మాణం.. నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీ వరకు.. ఆయన ఆలోచనలు ఎన్నడూ నిత్య నూతనమే.
టిడిపిని నిలబెట్టిన నేత..
చంద్రబాబు విషయంలో ఎవరికీ ఎన్ని అనుమానాలు ఉన్నా.. తెలుగుదేశం( Telugu Desam) పార్టీని నిలబెట్టిన నేత మాత్రం ఆయనే. జాతీయ పార్టీలే మనుగడ సాధించలేక వెనుకబడుతున్న తరుణంలో.. ఒక ప్రాంతీయ పార్టీని నాలుగు దశాబ్దాలపాటు నిలబెట్టడంలో చంద్రబాబు పాత్ర విశేషం. తెలుగుదేశం పార్టీని స్థాపించింది నందమూరి తారక రామారావు అయినా.. ఆ పార్టీకి మూడు దశాబ్దాల పాటు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి మాత్రం చంద్రబాబు. సంక్లిష్ట పరిస్థితుల నడుమ.. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ నుంచి హస్త గతం చేసుకున్నారు. దానిని వెన్నుపోటు అన్నారు ప్రత్యర్థులు. కానీ ఆ అపవాదును అధిగమించి.. ప్రజల మన్ననలు అందుకోగలిగారు. తనను తాను ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో నిలబెట్టుకోగలిగారు. తనపై వచ్చిన విమర్శలను, ఇబ్బందులను అధిగమించి.. ఉమ్మడి రాష్ట్రంలోనూ, నవ్యాంధ్రప్రదేశ్ లోను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా ఖ్యాతి గడించారు.
1999లో ప్రజామోదం
1994లో నందమూరి తారకరామారావు( Nandamuri Taraka Rama Rao ) నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. కానీ అక్కడకు ఏడాది కాకమునుపే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం వచ్చింది. నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతి వైఖరిని నిరసిస్తూ ఆయన కుటుంబమే వ్యతిరేకించింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అడ్డగోలుగా చీలిపోయింది. నాడు చంద్రబాబు నాయకత్వంలోకి ఎక్కువమంది ఎమ్మెల్యేలు వెళ్లారు. అలా పార్టీతో పాటు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న చంద్రబాబు పాలన మూన్నాళ్ళ ముచ్చట అనుకున్నారు. కానీ కార్యక్రమం లో సహకరించిన నందమూరి కుటుంబ సభ్యులే చంద్రబాబును వ్యతిరేకించారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కానీ వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ 1999 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 44.14% ఓట్లతో.. 181 సీట్లతో ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు. కానీ కాలక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నందమూరి తారక రామారావు తో సమానంగా ఆరాధ్య దైవంగా మారిపోయారు చంద్రబాబు. టిడిపికి అధ్యక్షుడిగా 30 సంవత్సరాలు.. సీఎంగా 15 సంవత్సరాలు.. ప్రతిపక్ష నేతగా మరో 15 ఏళ్లు.. ఇలా విలక్షణంగా, నిత్య నూతనంగా కనిపించారు చంద్రబాబు. అయితే ఇలా గుర్తింపు కోసం ఆయన పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు.