KCR role in Kaleshwaram: మీడియాకు లీకులు.. ఇంకా అనేకానేకా వాదనల తర్వాత కాలేశ్వరం అసలు బాగోతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో బయటపెట్టింది. వాస్తవానికి రేవంత్ ప్రభుత్వం నియమించిన ఘోష్ కమిషన్ నివేదిక కొద్దిరోజుల క్రితమే కొన్ని మీడియా సంస్థలకు లీక్ అయింది. దీని వెనుక ఎవరున్నారు.. ఎందుకు ఇలా చేశారు అనే విషయాలను కాస్త పక్కన పెడితే..ఘోష్ కమిషన్ పేర్కొన్న అంశాలు తెలంగాణ త్రీ గోర్జెస్ అసలు రూపాన్ని బయటపెట్టాయి. ప్రభుత్వం నియమించిన కమిషన్ వెల్లడించిన విషయాలలో కొన్ని అంశాలు నిర్వేదాన్ని కలిగిస్తున్నాయి..
బ్యారేజీలు నిర్మించే విషయంలో తీవ్రతప్పిదాలు జరిగాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక, మంత్రివర్గ ఉప సంఘం, హై పవర్ కమిటీ.. ఇలా ఏది కూడా ఆ బ్యారేజీలు కట్టాలని సిఫారసు చేయలేదు.
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయం మేరకే అవన్నీ నిర్మించారు. అంతేకాదు ఆ తప్పిదాలకు కేసీఆర్ కారణం కాబట్టి ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
2016 మార్చి ఏడవ తేదీన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తే.. మనకంటే ముందు అంటే 2017 ఏప్రిల్ 13న మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసే పనిని జీవో 2 ద్వారా వ్యాప్కోస్ కు అప్పగించారు. అంతేకాదు ఈ నోట్ పైల్ పై 2016 జూన్ 3న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సంతకాలు చేశారు.
అదే ఏడాది జనవరి 18న డీపీఆర్ కోసం పరిపాలనాపరమైన అనుమతిని కూడా అందించారు.. అదే ఏడాది జనవరి 17న నిర్వహించిన ఓ సమావేశంలో దీనికి ఆమోదం కూడా తెలిపారు. 2023 అక్టోబర్ లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అన్నారం, సుందిళ్ల ప్రాంతాలలో బుంగలు బయటపడ్డాయి.. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.
2016 మార్చి 1న కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన బ్యారేజీలకు సంబంధించి పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చారు. డ్యాం బ్రేక్ అనాలసిస్ పనులను 0.708 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, కాలేశ్వరం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు ప్రతిపాదనలు పంపించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఆమోదం, ర్యాటిఫికేషన్ అనే ప్రక్రియలు లేకుండానే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇవ్వడం విశేషం.
తుమ్మిడి హెట్టి, మేడిగడ్డ వద్ద బ్యారేజీల నిర్మాణానికి 2016 మార్చి ఎనిమిదిన మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరితే.. మూడు బ్యారేజీల నిర్మాణానికి దానికంటే ముందు అంటే 2016 మార్చి 1న పరిపాలనపరమైన అనుమతులకు సంబంధించిన జీవో ఇచ్చారు.. 2016 మార్చి 14న బడ్జెట్ ప్రసంగంలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.. చివరి డిపిఆర్ ను వ్యాప్కోస్ 2016 మార్చి 27న సమర్పించింది.. తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని.. కానీ ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించేలా నాటి ప్రభుత్వం వ్యవహరించిందని కమిషన్ పేర్కొంది.
బ్యారేజీ నిర్మాణాన్ని 148 మీటర్ల ఎత్తుతో కట్టుకోవడానికి సమ్మతి తెలిపేదని వెల్లడించింది.. కాలేశ్వరం బ్యారేజీల నిర్మాణ ఆలోచన మొత్తం కూడా కేసీఆర్ దేనని.. ప్రాణహిత చేవెళ్ల రి ఇంజనీరింగ్ నుంచి వ్యాప్ కోస్ కు నామినేషన్ విధానంలో డిపిఆర్ తయారీ అప్పగించడం.. అంచనాలను సవరించడం.. మంత్రివర్గం ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం.. బ్యారేజీలలో నీటిని నిల్వ చేసి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం.. ఇలా ప్రతి దాంట్లో కేసీఆర్ దే ప్రధాన పాత్ర అని కమిషన్ స్పష్టం చేసింది.
2015 జనవరి 21న జీవో 28 ను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది.. ఆ జీవోలో ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రాంతంలో నిర్మించదల్చుకున్న బ్యారేజీ నిర్ణయం ఏమాత్రం మంచిది కాదని.. దానికంటే ముందు ప్రాణహితపై వేమనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని సూచించిందని.. కానీ ఈ విషయాన్ని నాటి ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఘోష్ కమిషన్ పేర్కొంది.
కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను 2017 ఫిబ్రవరిలో దాఖలు చేయాలని అనుకున్నారు. దానికంటే 11 నెలల ముందే బ్యారేజీల నిర్మాణాలకు పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చారు. 2016 జూలై, ఆగస్టు నెలలో నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. అంతేకాదు కాలేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదించడానికి ముందు 2018 మార్చినాటికే 30,653 కోట్లను ఖర్చు చేశారు.. 665 పేజీలతో నివేదికను రూపొందించిన ఘోష్ కమిషన్ కెసిఆర్ పేరును 266 ప్రస్తావించింది. హరీష్ రావు పేరును 63 సార్లు పేర్కొంది.