Dancer Murali Babai Success Story: పేదరికం ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. ఎలా బతకాలో కూడా సూచిస్తుంది. మనలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీస్తుంది. ఒక్కోసారి మనలో కసిని పెంచుతుంది. ఆ కసి జీవితంలో మనకు ఒక ఉన్నత స్థానాన్ని కట్టబెడుతుంది. ఆరుపదుల వయసులో ఓ వ్యక్తికి సోషల్ మీడియా( social media) దారి చూపింది. ఒక సెలబ్రిటీ గా మార్చేసింది. ఎవరా వ్యక్తి? ఏంటా కథ? అంటే మనం ఒకసారి చిత్తూరు జిల్లా సంతపేట బాబాయ్ గురించి చదవాల్సిందే. ఇటీవల సోషల్ మీడియాలో లేటు వయసులో ఉన్న ఓ బాబాయ్ స్టెప్పులతో ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. ఈటీవీ ఢీ షోలో మెరిసిన మురళి బాబాయ్ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయారు. ఏ ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఆయనే.. ఎవరి ఫోన్లో చూసినా ఆయనే..
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
* ప్రత్యేక మేనరిజంతో..
‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సర’.. అంటూ చిరంజీవి( megastar Chiranjeevi) పాటకు డాన్స్ వేసినా..’గురువా గురువా’ అంటూ ఏఎన్నార్ పాటకు డాన్స్ వేసినా.. ఆయనకంటూ ఒక స్టైల్.. ఒక మేనరిజంతో ఆకట్టుకుంటున్నారు మురళి బాబాయ్( Murali Babai) . ఆయన జీవితం పూల పాన్పు కాదు. ఈ స్థాయి నైపుణ్యం ఉన్నా.. వెలుగులోకి రావడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని.. ఆయన నైపుణ్యం బయటపడింది. బయట ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు మురళి బాబాయ్ అంటే సెలబ్రిటీ. కానీ కూరగాయల కూలీగా, కోవా బన్ విక్రయించే చిరు వ్యాపారిగా.. జీవితం కోసం, జన్మనిచ్చిన పిల్లల కోసం చాలా బాధలు పడ్డారు మురళి బాబాయ్.
* నిరుపేద కుటుంబం..
మురళి బాబాయ్ సొంత గ్రామం చిత్తూరు నగరంలోని( Chittoor City) మంగసముద్రం ప్రాంతం. నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళి బాబాయ్ ఏడో తరగతి వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. చిత్తూరు, నెల్లూరు, చెన్నై ప్రాంతంలో తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు తన 20వ ఏటా ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద ఉండిపోయారు. అలా డాన్స్ పై ఆసక్తి ఉన్నా.. కుటుంబం కోసం కూరగాయల వ్యాపారిగా మారారు. చిత్తూరు మార్కెట్లో కూరగాయలు విక్రయించేవారు. కరోనా సమయంలో నష్టాలు రావడంతో పాటు భార్య, తల్లి మృతి చెందారు. మూడేళ్ల కిందట ఉపాధి కోసం తిరుపతి వెళ్లారు. అయితే ఓ డ్యాన్స్ షోలో ముఠామేస్త్రి సినిమాలో పాటకు డాన్స్ వేశారు. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పాపులర్ అయ్యారు. ఇటీవల ఢీ షోలో పాటకు డాన్స్ వేయడంతో సెలబ్రిటీగా మారిపోయారు. ఇప్పుడు మురళి బాబాయ్ అంటే తెలియని వారు లేరు. లేటు వయసులో గుర్తింపు దక్కించుకున్న ఈ బాబాయి మరింతగా రాణించాలని ఆశిద్దాం.