Chiranjeevi: సినీ పరిశ్రమ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతు పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టాలీవుడ్ స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా పవన్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో మంచి విజయం దక్కాలని ఆకాంక్షిస్తున్నారు. ఒకేరోజు నలుగురు నటులు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ప్రధానంగా నేచురల్ స్టార్ నాని తన మద్దతును ప్రకటించారు. అటు రామ్ చరణ్ సైతం కీలక ప్రకటన చేశారు. మరో హీరో రాజ్ తరుణ్ సైతం స్పందించారు. అటు తేజ సజ్జా సైతం తన మద్దతు ప్రకటించారు. కమెడియన్ హీరో సంపూర్ణేష్ బాబు అయితే ఏకంగా మీ ప్రేమకు బానిస అంటూ ప్రకటన చేయడం ఆకట్టుకుంది.
గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేశారు పవన్. కానీ మెగాస్టార్ కుటుంబం, కొద్దిపాటి బుల్లితెర నటులు మినహాయించి.. పెద్దగా మద్దతు తెలిపిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీకి కొంతవరకు సినీ పరిశ్రమ మద్దతు ఉన్నా.. నాటి ఎన్నికల్లో పవన్ కు పెద్దగా సినీ పరిశ్రమ అండగా నిలవలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా సినీ పరిశ్రమ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ వాల్ హీరోలు పవన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. పలువురు బుల్లితెర నటులు స్టార్ క్యాంపైనర్లుగా ఉన్నారు. పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
తమ్ముడు పవన్ కు మద్దతుగా చిరంజీవి ఏకంగా ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కోరారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి వీడియోను తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు రామ్ చరణ్. భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ ను గెలిపించండి అంటూ పోస్ట్ చేశారు.
మరోవైపు నేచురల్ స్టార్ నాని సైతం పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు.’ పవన్ కళ్యాణ్.. మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా. మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. మీకు ఎంతోమంది ప్రేమాభిమానాలు తోడున్నాయి. నా మద్దతు మీకే. ఆల్ ది బెస్ట్ సర్’ అని నాని తన సందేశాన్ని పంపించారు.
యువ హీరో రాజ్ తరుణ్ సైతం స్పందించారు. పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు.’ ఏపీ శ్రేయస్సు కోసం మీ కృషిని, ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఆశాదీపం. మీరు గెలిచి ప్రజల తలరాతలు మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి’ అని ఎక్స్ వేదికగా జనసేనకు సపోర్ట్ చేశారు. ఇక యువ నటుడు తేజ సజ్జా తన ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. మరోవైపు సంపూర్ణేష్ బాబు విభిన్నంగా స్పందించారు.’ ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ప్రజా పోరాటం నుంచి వెనక్కి తగ్గని మీ పోరాట పటిమ ఎప్పటికీ స్ఫూర్తి. రానున్న ఎన్నికల్లో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ సదా మీ ప్రేమకి బానిస. మీ సంపూర్ణేష్ బాబు అంటూ పోస్ట్ చేశారు. అయితే చిరంజీవి వీడియో విడుదల చేసిన తరువాత సినీ పరిశ్రమ నుంచి ఒక్కొక్కరూ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపడం విశేషం.