Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) జై జనసేన నినాదం వెనుక వ్యూహం ఉందా? చిరంజీవి ఎందుకు ఆ ప్రకటన చేయాల్సి వచ్చింది? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అవన్నీ ఊహాగానాలేనని తేలిపోయింది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రయత్నాలు చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే దానికి చిరంజీవి ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. సినీ వేడుకల్లో మాత్రం మరోసారి రాజకీయాల్లోకి వెళ్ళేది లేదని సంకేతాలు ఇచ్చారు. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఎన్నడు తన అన్న రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు. ఆయనను ఒక పెద్ద మనిషి తరహాలో చూడాలని మాత్రమే భావించారు. కానీ అటువంటిది అనూహ్యంగా చిరంజీవి జై జనసేన అని నినదించడం మాత్రం ప్రత్యేకమే. నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన అంటూ వ్యాఖ్యానించడం మాత్రం సంచలనంగా మారింది.
* 2009లో పిఆర్పి ఆవిర్భావం
2009లో ప్రజారాజ్యం( Praja Rajyam ) పార్టీని స్థాపించారు మెగాస్టార్ చిరంజీవి. ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేశారు. కానీ 18 అసెంబ్లీ సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒకచోట మాత్రమే గెలిచారు. నాడు ప్రజారాజ్యం పార్టీని ఎక్కువ రోజులు నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే నాడు ప్రజారాజ్యం పార్టీ విలీనం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని ప్రచారం నడిచింది. అయితే ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చాలామంది నేతలుగా ఎదిగారు. అటువంటి వారు ఇప్పుడు వేరు వేరు పార్టీల్లో ఉన్నారు. వారిని జనసేనలో చేర్చుకునేందుకే చిరంజీవి ఈ ప్రకటన చేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
* రాజకీయాలకు దూరం
అయితే చిరంజీవి( Chiranjeevi) రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయడం లేదు. ఈ ఎన్నికల్లో మాత్రం పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా కూటమికి మద్దతు తెలుపుతూ సంకేతాలు పంపారు. అటు తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రజలకు అభివాదం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అప్పటినుంచి మెగాస్టార్ చిరంజీవి కోసం బిజెపి ప్రయత్నిస్తోందన్న కామెంట్స్ ప్రముఖంగా వినిపించాయి. కానీ అటువంటిదేమీ జరగలేదు.
* జోరుగా ఊహాగానాలు
అయితే తాజాగా జై జనసేన( janasena ) అన్న నినాదం చిరంజీవి నోటి నుంచి వినిపించడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర పెద్దలే చిరంజీవితో ఆ మాట అనిపించారన్నది ప్రధాన కామెంట్. అయితే చిరంజీవిని బిజెపిలోకి తీసుకెళ్తారే కానీ.. ఎందుకు జనసేనకు జై కొట్టిస్తారన్నది ప్రశ్న. అయితే ఏపీలో బిజెపితో పాటు జనసేన బలం కూడా పెరగాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. తద్వారా టిడిపిని కంట్రోల్ పెట్టడంతో పాటు వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అది అంత సులువు కాదని కూడా విశ్లేషిస్తున్నారు. కానీ అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రకటన చేయడం మాత్రం విస్తు గొలుపుతోంది. దీని వెనుక వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.