Chirala YCP : చీరాల వైసీపీ హైకమాండ్ కు చికాకు తెప్పిస్తోంది. ఎంత సర్దుబాటు చేసినా అక్కడ గ్రూపులు గోల కట్టడి కావడం లేదు. ఒకే వరలో రెండు కత్తులు చేరడం లేదు. దీంతో అయినదానికి కానిదానికి రెండు వర్గాలు కొట్లాటకు దిగుతున్నాయి. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది హైకమాండ్ వ్యవహారం. చీరాల వైసీపీలో కరణం బలరామకృష్ణ, ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ నాకంటే నాకు అని ఇరువురు నేతలు వాదనకు దిగుతున్నారు. దీంతో హైకమాండ్ కరణం కుమారుడు వెంకటేష్ చీరాల ఇన్ చార్జిగా, ఆమంచికి పర్చూరు ఇన్ చార్జిగా జగన్ నియమించారు. అక్కడితో గొడవలకు ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు.
చీరాలలోని పేరాలలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘటనలో ఆమంచి వర్గీయుడైన కౌన్సిలర్ సత్యానందకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఎదురెదురుపడిన రెండు వర్గాలు పరస్పరం కవ్వించుకున్నాయి. దాడులకు తెగబడ్డాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఇరువర్గాల వారిని సముదాయించారు. లేకుంటే గొడవ మరింత ముదిరేది.దీంతో ఆస్పత్రి ప్రాంగణం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో వైసీపీ పరిస్థితి మరింత వీధిన పడినట్టయ్యింది.
గత ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ సీటును టీడీపీ గెలుచుకుంది. సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణను చీరాల నుంచి చంద్రబాబు బరిలో దించారు. ఆయన ఆమంచి కృష్ణమోహన్ పై గెలుపొందారు. అయితే కొద్దిరోజులకే ఆయన టీడీపీ నుంచి ఫిరాయించారు. అధికార పార్టీకి సన్నిహితమయ్యారు. అప్పటివరకూ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న ఆమంచికి ఇది మింగుడుపడలేదు. కరణం రాకను వ్యతిరేకించారు. అయినా టీడీపీని దెబ్బకొట్టాలన్న భావనతో కరణం బలరాంను జగన్ తన శిబిరంలోకి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ హామీతోనే ఆయన జగన్ వైపు వచ్చినట్టు తెలిసింది. దీంతో బలరాం కుమారుడు వెంకటేష్ కు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమంచికి పర్చూరుకు పంపించారు.
ఇప్పటికే రెండుసార్లు చీరాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమంచి కృష్ణమోహన్ అయిష్టతగానే పర్చూరు వెళ్లారు. వైసీపీలో యాక్టివ్ గా ఉండే ఆయన సోదరుడు జనసేనలో చేరారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ సైతం ఎన్నికల సమయంలో జనసేనలోకి వెళతారని ప్రచారం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చీరాలలో పట్టుబిగించాలని ఆమంచి చూస్తున్నారు. తనను పర్చూరు కు పంపించి జగన్ అవమానించారని ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. ఇప్పుడు ఏకంగా కరణం బలరాం అనుచరులతో ఆమంచి అనుచరులు కయ్యానికి కలబడుతుండడంతో ఎన్నికల ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే చాన్స్ ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.