దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. దీంతో చికెన్ ను తినేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా ధరలు సైతం అమాంతం పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో చికెన్ ధరలు ఏకంగా 100 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెరగడం గమనార్హం.
చికెన్ ధరలు పెరగడాన్ని చూసి చికెన్ ను కొనుగోలు చేయాలంటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో 7 రోజుల వ్యవధిలో కిలో చికెన్ ధర ఏకంగా 300 రూపాయలకు చేరింది. ఆదివారం కేజీ చికెన్ 285 రూపాయలుగా ఉండగా రెండు రోజుల వ్యవధిలోనే చికెన్ ధర 15 రూపాయలు పెరిగింది. కొందరు వ్యాపారులు చికెన్,గుడ్ల ధరలను కృత్రిమ కొరత సృష్టించి పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బ్రాయిలర్ అసోసియేషన్ మార్కెట్ లో చికెన్ కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ధరను నిర్ణయిస్తుంది. నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ సభ్యులు గుడ్ల ధరలను నిర్ణయిస్తారు. అయితే వీరు ప్రైవేట్ వ్యక్తులు కావడంతో ఇష్టానుసారం ధరలను పెంచుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైనన్ని కోళ్లు అందుబాటులో ఉన్నా కావాలనే కొరతను సృష్టిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
చికెన్ ధరలు పెరగడం వల్ల రిటైల్ వ్యాపారులపై ఆ ప్రభావం పడుతోంది. ధరలు పెరగడం వల్ల కిలో చికెన్ ను కొనుగోలు చేసేవాళ్లు అరకేజీ చికెన్ తో సరిపెట్టుకుంటున్నారు. చికెన్ ధరలు తగ్గేలా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.