CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు చాలా హుందాగా ఉంటారు. తన భావోద్వేగాన్ని అంత వేగంగా బయట పెట్టరు. అందునా మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. గతంలో అసెంబ్లీ వేదికగా తన కుటుంబం పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఆ సమయంలో ఎంతో సహనంతో వ్యవహరించారు. సంయమనం పాటించారు. విలేకరుల సమావేశంలో భావోద్వేగాన్ని అదుపు చేయలేక బోరున విలపించారు. ఆ సమయంలో ఆయనను వ్యతిరేకించే వారు సైతం బాధపడ్డారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వ్యక్తిగత హననం అనేది ఉండకూడదు అని భావించారు చంద్రబాబు. వ్యక్తిగత విమర్శలు వద్దంటూ వారించే ప్రయత్నం కూడా చేశారు. అటు నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాల విషయంలో కఠినంగా కూడా ఉన్నారు. మీరు కాలికి నమస్కరిస్తే.. నేను కూడా మీ కాలికి నమస్కారం చేయాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. తన పర్యటనలో హంగు ఆర్భాటాలను కూడా తగ్గించారు. జన సమీకరణలు, ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ హడావిడి ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పరదాలు కట్టొద్దని కూడా సూచించారు.
* వద్దని వారించిన చంద్రబాబు
అయితే చంద్రబాబుపై ఉన్న అభిమానంతో ఓ మహిళ ఆయనను ముద్దు పెట్టే ప్రయత్నం చేసింది. అనకాపల్లి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు రోడ్డు మీద నడుచుకుంటూ తన కాన్వాయ్ దగ్గరకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఆప్యాయంగా హత్తుకున్నారు. దీంతో చంద్రబాబు కూడా ఆమె భుజంపై ఆప్యాయంగా చేయి వేసి ఫోటో దిగుతున్నారు. అయితే హఠాత్తుగా ఆ మహిళ చంద్రబాబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించింది. దీంతో చంద్రబాబుతో పాటు భద్రత సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. చంద్రబాబు సున్నితంగా వద్దని వారించారు. ఆమెతో ఫోటో దిగి పంపించారు.
* అమరావతిలో ఇదే మాదిరిగా
మొన్న ఆ మధ్యన అమరావతి రాజధానిలో సీఆర్డీఏ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు చంద్రబాబు. సహజంగానే అమరావతి రైతుల్లో చంద్రబాబు పట్ల విపరీతమైన భక్తి భావం ఉంటుంది. ఈ తరుణంలో ఓ వ్యక్తి చంద్రబాబు కాలికి నమస్కరించే ప్రయత్నం చేశారు. వయస్సు రీత్యా సదరు వ్యక్తి చంద్రబాబుతో సమానంగా ఉంటారు. దీనిపై కాస్త కఠినంగానే స్పందించారు చంద్రబాబు. ఆ వ్యక్తి కాలు పట్టుకుని నమస్కరించేందుకు ప్రయత్నించారు. తాను సాష్టాంగ నమస్కారాలు వద్దని చెప్పానని.. కాలికి నమస్కారం పెట్టవద్దని సూచించానని.. అయినా సరే అలా పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అయితే గత ఐదేళ్ల వాతావరణానికి భిన్నంగా… పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండడం విశేషం.