Chandrababu – BJP : చంద్రబాబుకు పట్టని బీజేపీ అంతరంగం

తన విషయంలో భిన్న వైఖరితో ఉండే ఆమె పొత్తుకు అనుకూలంగా ఉండరుగాక ఉండరు అన్నది చంద్రబాబు అభిమతం. దీంతో బీజేపీ విషయంలో ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న మాదిరిగా చంద్రబాబు పరిస్థితి మారిపోయింది.

Written By: Dharma, Updated On : July 7, 2023 9:25 am
Follow us on

Chandrababu – BJP : బీజేపీ అంతరంగం అంతుపట్టడం లేదు. ముఖ్యంగా చంద్రబాబుకి ఏం పాలుపోవడం లేదు. బీజేపీ విషయంలో ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియడం లేదు. అసలు ఢిల్లీ పెద్దల అభిమతం ఏమిటి? అన్నది తెలుసుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఒక వైపు జగన్ కు సాయం, మరోవైపు నాయకత్వాల మార్పు, మరోవైపు తనతో సంప్రదిస్తుండడంతో..చంద్రబాబు కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. అందుకే బీజేపీపై ఆరాటం తగ్గించేశారు. కానీ జరుగుతున్న పరిణామాలు ఆయనకు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

చంద్రబాబు మోస్ట్ సీనియర్ లీడర్. కానీ ప్రస్తుతం ఆయన్ను గుర్తించేవారు లేకపోతున్నారు. పవర్ లేకపోయేసరికి ఆయనకు తగిన గుర్తింపు లభించడం లేదు. జాతీయ స్థాయిలో మంచి నాయకుడిగా పేరున్నా ఆయన సేవలు సైతం అక్కరకు రావడం లేదు. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ ఆయన వైపు చూడడం లేదు. పోనీ విపక్ష శిబిరంలోకి వెళదామంటే గత ఎన్నికల్లో ఎదురైన పరాభావం కళ్లెదుటే కనిపిస్తోంది. అందుకే వెనక్కి తగ్గి నిరాదరణ కలిగిన నాయకుడిగానే కొనసాగుతున్నారు. ఎలాగోలా తన మనసుకు సర్ధిచెప్పుకుంటున్నారు.

బీజేపీ తనతో స్నేహం చేస్తుందని భావిస్తున్నారు. అలా అనుకుంటే తన ప్రత్యర్థి జగన్ కు సాయం ఎందుకు చేస్తున్నట్టు? అప్పులకు ఎడాపెడా అనుమతులిస్తోంది. కేసుల నుంచి విముక్తి కల్పిస్తోంది. ఎన్నోరకాల ఉపశమనాలను కలిగిస్తోంది. అంటే తనపై ఇంకా నమ్మకం కుదరలేదన్న ఆత్రం, భయం చంద్రబాబును వెంటాడుతోంది. పోనీ వైసీపీతో బీజేపీ అంటగాకుతుందన్న ప్రచారం చేస్తామంటే.. దానిని గత ఎన్నికల్లోనే వాడేశారు. ఇలా వాడినందుకే తనతో పాటు బీజేపీని సైతం జనాలు పడుకోబెట్టేశారు. అందుకే చంద్రబాబుకు ఏం అనాలో? ఎలా స్పందించాలో తెలియడం లేదు.

అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో సైతం ఏం అర్ధం కావడం లేదు. బీజేపీతో పొత్తునకు సోము వీర్రాజు ఒప్పుకోవడం లేదు కదా అని మార్పును కోరుకున్నారు. ఇప్పుడు అంతకంటే స్ట్రాంగ్ లేడీ పురంధేశ్వరి వచ్చారు. గత ఎన్నికల తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో కొనసాగాలంటే పురంధేశ్వరి సైతం బీజేపీని విడిచిపెట్టి రావాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించింది. కానీ పురంధేశ్వరి ఒప్పుకోలేదు. చివరకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి దూరమయ్యారు. అంతలా ఉంటాయి పురంధేశ్వరి నిర్ణయాలు. తన విషయంలో భిన్న వైఖరితో ఉండే ఆమె పొత్తుకు అనుకూలంగా ఉండరుగాక ఉండరు అన్నది చంద్రబాబు అభిమతం. దీంతో బీజేపీ విషయంలో ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న మాదిరిగా చంద్రబాబు పరిస్థితి మారిపోయింది.