AP Liquor policy : మద్యం అమ్మకాలు ఇప్పుడు ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. దీంతో వీలైనంత ఎక్కువ మద్యం అమ్మడం.. ప్రజలతో ఎక్కువగా తాగించడం.. ఎక్కువ ఆదాయం పొందడమే లక్ష్యంగా మద్యం పాలసీలు రూపొందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గత ప్రభుత్వ మద్యం పాలసీ అమలులో ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్.. నూతన మద్యం పాలసీ అమలుకు ప్రణాళిక రూపొందించింది.
మూడు నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని అక్కడి ప్రజలు తిరుగులేని మెజారిటీతో గెలిపించారు. కూటమికి 164 సీట్లు వచ్చాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన అనేక హామీలు.. వైసీపీ పాలనలో సంక్షేమం మినహా అభివృద్ధి లేకపోవడంతో అధికారం మారింది. కొత్తగా అధికారం చేపట్టిన టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆదాయం పెంచుకునే అంశాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా కొత్త మద్యం పాలసీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో చేసిన అధ్యయనాలను పరిశీలించింది. కన్సల్టెన్సీ సమర్పించిన నివేదికలను పరిగణనలోకి తీసుకుని 2019కి ముందు ఉన్న పాలసీనే మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టాలని ఎక్సైజ్ శాఖ భావించింది. దాని ప్రకారం, రిటైల్ మద్యం వ్యాపారం ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించబడుతుంది. తెలంగాణలో అమలు చేస్తున్న మద్యం పాలసీకి స్వల్ప మార్పులు చేసి ఏపీ పాలసీ ముసాయిదాను సిద్ధం చేసింది. దీంతో ప్రభ్వుత్వం మద్యం షాపులకు స్వస్తి పలకనుంది. కొత్త పాలసీలో వ్యాపారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లను కేటాయించనుంది.
దరఖాస్తు ధరలు ఇలా..
ఇక తెలంగాణ తరహాలోనే ఒక్కో దరఖాస్తు ధరను రూ.2 లక్షలుగా నిర్ణయించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇది తిరిగి చెల్లించబడదు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా మద్యం ధర కూడా ఉండేలా చూడాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. తద్వారా మద్యం అక్రమ రవాణాను నివారించే అవకాశం ఉంటుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. నూతన మద్యం పాలసీ రూపకల్పనకు ఏపీ సర్కార్ మంత్రుల కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇతర రాష్ట్రాల్లో అధ్యయన నివేదికల ఆధారంగా..
ఎకౌ‍్సజ్ శాఖ సమర్పించిన ఇతర రాష్ట్రాల్లో జరిగిన అధ్యయనాల నివేదికలు, ఎక్సైజ్ శాఖ తొలి ప్రతిపాదనలను కమిటీ సమీక్షిస్తుంది. వ్యాపారం, ధరలు, మద్యంపై విధించే పన్నులపై కూడా చర్చిస్తారు. సమాజంలోని వివిధ వర్గాలు, వాటాదారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత వారం రోజుల్లో ఎక్సైజ్ పాలసీని కమిటీ రూపొందిస్తుంది.
గత ప్రభత్వం ఇలా..
గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్‌ఈబీని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత 70 శాతం మంది ఎస్‌ఈబీ సిబ్బంది తమ హోం డిపార్ట్‌మెంట్లలోకి వెళ్తారు. సెప్టెంబర్ 5 నుంచి ఎక్సైజ్ శాఖలో బదిలీలు చేపట్టనున్నారు. ఆ తర్వాత మద్యం పాలసీని ఖరారు చేసి, దరఖాస్తులను ఆమోదించి, సెప్టెంబర్ నెలాఖరులోపు లైసెన్సులు జారీ చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నాటికి కొత్త మద్యం పాలసీని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మద్యం పాలసీతోపాటుగా ట్రాక్ అండ్ ట్రేస్, డీఅడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపైనా ఫోకస్ పెట్టారు. అంతేకాదు మంచి బ్రాండ్‌లను కూడా అందుబాటులోకి తేస్తామని చెబుతోంది ప్రభుత్వం.