TDP Janasena Alliance: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. ఇప్పటివరకు జగన్ 68 చోట్ల సిట్టింగ్లను మార్చారు. అదే సమయంలో టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు, బిజెపి కూటమిలోకి చేరడం వంటివి చురుగ్గా జరగడం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. ఈ నెలాఖరుకు బిజెపి నుంచి స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ‘రా కదలిరా’ పేరిట భారీ సభలు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం లో ఒక అసెంబ్లీ స్థానంలో ఈ సభలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం సభలు పూర్తయ్యాయి. అభ్యర్థులు ఖరారైన చోట ఈ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సభకు హాజరవుతున్న చంద్రబాబు.. వేదికపై నుంచి టిడిపి అభ్యర్థి విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈయనే పోటీ చేస్తారని సంకేతాలు పంపుతున్నారు.
అయితే జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకముందే చంద్రబాబు చేస్తున్న ప్రకటన పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా ఆయనను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఖరారు చేశారు. అయితే మండపేట నుంచి పోటీ చేసేందుకు జనసేన పార్టీ సైతం సిద్ధంగా ఉంది. కానీ అవేవీ పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించడంపై జనసేనలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
గత ఎన్నికల్లో మండపేట నుంచి జనసేన నేత లీలా కృష్ణ పోటీ చేశారు. 35 వేలకు పైగా ఓట్లు సాధించారు. అక్కడ జనసేన బలమైన స్థితిలో ఉంది. టిడిపి తో పొత్తు నేపథ్యంలో జనసేనకు ఆ సీటు కేటాయిస్తారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. కానీ జనసేన అగ్రనాయకత్వానికి మాటమాత్రమైన చెప్పకుండా టిడిపి అభ్యర్థిని ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో లీలా కృష్ణ పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఏకపక్ష ప్రకటనను ఖండించారు. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఒక్క మండపేట కాదు.. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. మరి ఈ ఇబ్బందుల నుంచి ఆ రెండు పార్టీలు ఎలా అధిగమిస్తాయో చూడాలి.