CM Chandhrababu Cases : గత ఐదేళ్లుగా జగన్ టిడిపి నేతల వెంటపడ్డారు. కేసులతో హింసించారు. చివరకు చంద్రబాబు పై సైతం కేసులు నమోదు చేయించారు. 2014 నుంచి 2019 మధ్య అవకతవకలకు పాల్పడ్డారంటూ వరుసుగా కేసులు నమోదు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక.. ఇలా వరుస స్కాంల్లో ఇరికించారు.చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. చంద్రబాబు బెయిల్ కోసం నానా హైరానా పడ్డారు. చివరకు సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి కీలకంగా మారారు. టిడిపికి వచ్చిన 16 ఎంపీ స్థానాలు ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకంగా మారాయి. అయితే అప్పట్లో వైసీపీ సర్కార్ చంద్రబాబు పై నమోదు చేసిన కేసులు విషయంలో ఎలా ముందుకెళ్లాలో కోర్టులకు సైతం తెలియడం లేదు. సాధారణంగా రాజకీయ కక్షలతో ముందు ప్రభుత్వం నమోదు చేయించే కేసులపై.. తరువాత వచ్చే ప్రభుత్వం పునసమీక్షిస్తుంది. కేసులకు హేతుబద్ధత లేకపోతే వెనక్కి తీసుకుంటుంది. కేసులు నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని సిఐడి కావడంతో.. సమీక్షించి వెనక్కి తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం.. ఈ కేసుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో న్యాయస్థానాలు సైతం ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతమవుతున్నాయి.
* సిబిఐకి అప్పగించాలన్న కేసులో
వైసీపీ హయాంలో చంద్రబాబుతో పాటు నారాయణ పై కేసులు నమోదయ్యాయి. సిబిఐతో పాటు ఈడికి అప్పగించాలని విజయవాడకు చెందిన ఓ జర్నలిస్ట్ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ తరుణంలో న్యాయమూర్తి కీలక సందేహాలను లేవనెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పై ఉన్నారు. ఆయన వేసిన పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. మరోవైపు కేసులు నమోదు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కేసులను పునః సమీక్షించే అవకాశం ఉంది. అందుకే ఎలా ముందుకెళ్లాలో తెలియక కోర్టు డిఫెన్స్ లో పడింది.
* పునః సమీక్షకు అవకాశం
వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతోంది. తనపై అక్రమంగా నమోదు చేశారని భావిస్తున్న చంద్రబాబు దీనిపై పునః సమీక్షకు ఆదేశించే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు ఆ పని చేయలేదు. అందుకే ఈ కేసులు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ కేసులను ఎప్పటి ప్రభుత్వం సమీక్షించకుండా ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటీషనర్ ను ప్రశ్నించింది. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వని విషయాన్ని గుర్తు చేసింది. అయినా సరే చంద్రబాబుపై నమోదైన కేసులపై అభిప్రాయం చెప్పాలని సిఎస్ తో పాటు హోం శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11 కు వాయిదా వేసింది.
* కేసులను వెనక్కి తీసుకుంటారా?
సాధారణంగా ముందు ప్రభుత్వం నమోదు చేసిన కేసులు.. తరువాత ప్రభుత్వం విషయంలో మందగిస్తాయి. జగన్ విషయంలో జరిగింది అదే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ కేసుల్లో ప్రతి శుక్రవారం ఆయనకోర్టుకు హాజరయ్యేవారు.2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మినహాయింపు లభించింది. ఇప్పుడు చంద్రబాబు కేసుల విషయంలో జరిగేది అదే. తప్పకుండా సమీక్షించే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు పై కేసులు నమోదు చేసింది సిఐడి. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. అందుకే ఈ కేసులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తూ ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.