CM Chandhrababu : ఏపీ సీఎం చంద్రబాబు ఫ్యామిలీ విషయాలను చాలా అరుదుగా ప్రస్తావిస్తారు. వేదికలపై పంచుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడో ఒకసారి మాత్రం తన భార్య భువనేశ్వరి గురించి మాట్లాడుతుంటారు. ఆమె సైతం భర్తతో పాటు వేదికలు పంచుకోవడం చాలా తక్కువ. కానీ భర్త అక్రమ కేసుల్లో చిక్కుకున్నప్పుడు మాత్రం ఆమె బయటకు వచ్చారు. ఆయనకు అండగా నిలిచేందుకు ప్రయత్నించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు బయట బస్సులోనే సుదీర్ఘకాలం గడిపారు. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. చంద్రబాబు సీఎం అయ్యాక దేవస్థానాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు భువనేశ్వరి. అయితే అదే భువనేశ్వరికి చంద్రబాబు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. గతంలో చంద్రబాబు తనకు ఒక చీర కొన్నారని.. దానికి కలర్, నాణ్యత అస్సలు బాగోలేదని గతంలో ఒక బహిరంగ వేదిక లోనే భువనేశ్వరి చెప్పుకొచ్చారు. అప్పట్లో అది హాట్ టాపిక్ గా మారింది. ప్రజా జీవితంలో ఉన్నందున చంద్రబాబు తనకోసం షాపింగ్ చేసిన దాఖలాలు లేవని చెప్పుకోచ్చే ప్రయత్నంలో భాగంగా భువనేశ్వరి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాజాగా భువనేశ్వరి కోసం రెండు చీరలను కొన్నారు చంద్రబాబు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత చీరలను కొనుగోలు చేసిన చంద్రబాబు..భార్యకు గిఫ్టుగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చేనేత కార్మికులను ఉద్దేశించి కీలక ప్రసంగం కూడా చేశారు.
* మంత్రిగా ఉండగా వివాహం
చంద్రబాబుది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. మంత్రి అయిన తరువాతే ఆయన వివాహం భువనేశ్వరితో జరిగింది. 1978లో తొలిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో 20 వేల మెజారిటీతో గెలిచారు. 28 ఏళ్ల నాటికి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా ఉండగానే ఎన్టీఆర్ కుమార్తెను చంద్రబాబు వివాహం చేసుకున్నారు. 1981 సెప్టెంబర్ 10న వివాహ బంధంతో ఒక్కటయ్యారు చంద్రబాబు, భువనేశ్వరిలు. అదే ఏడాది టిడిపి ఆవిర్భవించింది. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు చంద్రబాబు. ఓటమి తప్పలేదు. దీంతో మామ స్థాపించిన టిడిపిలో చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి చేరారు. పార్టీ పగ్గాలు అందుకున్నారు.
* సాధారణ గృహిణి గానే
నారా భువనేశ్వరి ఒక సాధారణ గృహిణి గానే కొనసాగారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన హెరిటేజ్ డైరీ బాధ్యతలను భువనేశ్వరి చూసుకునేవారు. రాజకీయాల్లో చంద్రబాబు బిజీగా ఉండే సమయంలో హెరిటేజ్ బాధ్యతలతో పాటు కుమారుడు లోకేష్ పెంపకం బాధ్యతలను కూడా భువనేశ్వరి కొనసాగించేవారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా, మరో ముఖ్యమంత్రి భార్యగా.. ఆమె రాజకీయ వేదికలను పంచుకున్నది తక్కువే.అయితే వైసిపి హయాంలో.. చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేశారు. 52 రోజులు పాటు రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆ సమయంలో మాత్రం భావోద్వేగానికి గురయ్యారు. అయినా ధైర్యంతో ముందుకు సాగారు.
* చీరలను కొనుగోలు చేసిన చంద్రబాబు
మొన్నటి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కూడా నారా భువనేశ్వరి హైలెట్ అయ్యారు. ఒకానొక దశలో వేదికపై ఉన్న భువనేశ్వరి ని చూసి సోదరుడు బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె సహనాన్ని గుర్తుచేసుకొని నుదుటిపై ఆత్మీయ ముద్దు పెట్టి సోదరిని ఆశీర్వదించారు. అయితే తనకు భర్త చంద్రబాబు ఒకసారి మాత్రమే చీర తెచ్చారని.. అది ఏ మాత్రం బాగాలేదని భువనేశ్వరి చెప్పిన నేపథ్యంలో.. ఆమె కోసం ప్రత్యేకంగా రెండు చీరలను చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవం నాడు కొనుగోలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More