Chandrababu: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ సమర్ధిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తరచూ చెబుతున్నారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి ఇలానే కొనసాగాలని భావిస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. తరచూ పిఠాపురంలో జరుగుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపి ఇన్చార్జ్ వర్మ వ్యవహరిస్తున్న తీరుతో కూటమికి ఇబ్బందులు వస్తున్నాయి. పిఠాపురంలో అధికారిక కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న బాధ వర్మ లో ఉంది. ఫ్లెక్సీలతో పాటు కార్యక్రమాల కు సంబంధించి చంద్రబాబు ఫోటో చిన్నదిగా పెడుతున్నారని తరచు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్మ. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఒక పరిణామం సోషల్ మీడియాను షేక్ చేసింది. జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు తో వర్మ కయ్యానికి దిగారు. దీనిపై టిడిపి హై కమాండ్ చాలా ఆగ్రహంగా ఉంది.
* కూటమి కొనసాగాలంటే.. పిఠాపురం( Pithapuram) ఎమ్మెల్యే గా ఉన్న పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. అటువంటి నియోజకవర్గంలో కూటమిలో జరుగుతున్న వివాదాలు, అందుకు కారణమవుతున్న వర్మపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారట. ఇటీవలే పార్టీ పదవి కూడా వర్మకు ఇచ్చారు. కూటమి కోసం పవన్ కళ్యాణ్ సర్దుబాటుతో ముందుకు వెళ్తుంటే.. వర్మ మాత్రం చంద్రబాబుకు అన్యాయం జరుగుతోందని చెప్పి నానా గలాటా సృష్టిస్తున్నారు. కేవలం తనకు రావాల్సిన ఎమ్మెల్యే పదవిని పవన్ కళ్యాణ్ తన్నుకు పోయారన్న బాధ ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దానికి పార్టీ ముద్ర వేసి, చంద్రబాబు పేరు తీసుకొచ్చి అనవసర వివాదాలు సృష్టిస్తున్నారు అన్నది వర్మపై వస్తున్న విమర్శ. ఏదైనా పార్టీ పరంగా ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చు కదా అని టిడిపి పెద్దలు చెబుతున్నారు. కానీ వర్మ మాత్రం తరచూ వివాదాల్లో చిక్కుకొని కూటమికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు.
* సోషల్ మీడియాలో హల్ చల్..
ఇటీవల ఓ అధికారిక కార్యక్రమంలో.. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేశారు అంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకు దిగినంత పని చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న జనసేన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. వర్మతో తక్షణం మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును ఆదేశించారట. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారట.. చిన్న చిన్న ఫ్లెక్సీ గొడవలను కూడా పార్టీతోపాటు కూటమిని అంటగట్టడం తగదని చంద్రబాబు హితవు పలికారట. గట్టిగానే చెప్పాలని సూచించారట.