Chandrababu Oath Ceremony: ఏపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ సైతం ప్రమాణస్వీకారం చేశారు. ఆ ఇద్దరు నేతలు ప్రమాణస్వీకారం చేసే సమయంలో కేసరిపల్లిలోని ప్రాంగణం మార్మోగిపోయింది. మూడు పార్టీల శ్రేణులు సాదరంగా ఆహ్వానించాయి. దాదాపు వారిద్దరి తరువాత.. వరుసగా 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ వారితో ప్రమాణం చేయించారు.
కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలి వచ్చారు. ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ప్రధాని ప్రాంగణానికి రాగా జనం చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు. తొలుత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఒకవైపు ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూర్చున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూర్చున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోడీకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సైతం నమస్కారాలు చేశారు. అటువైపుగా ఉన్న అమిత్ షా, జేపీ నడ్డా, సినీస్టార్లకు నమస్కారాలు చేసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం వచ్చి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
పవన్ అను నేను అని పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం ప్రారంభించే నాటికి.. ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగింది. ఈలలు, గోలతో నిండిపోయింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఇతర పెద్దలు సైతం చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు. ఎటువంటి బెరుకు లేకుండా పవన్ ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. అటు తరువాత మంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేయడం ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల తర్వాత లోకేష్ ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.