Chandrababu Delhi Visit: కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) ప్రాధాన్యం పెరిగింది. చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు. తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు పెద్ద ఎత్తున రాబెడుతున్నారు. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాలు సైతం పొందుతున్నారు. అయితే ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.. అక్కడ అమిత్ షా తో సమావేశం కానున్నారు. అయితే ఇది డిన్నర్ మీటింగ్ గా తెలుస్తోంది. డిన్నర్ చేసిన తర్వాత తిరిగి ఆయన అమరావతి వచ్చేస్తారని తెలుస్తోంది. అయితే ఇంత అత్యవసరంగా చంద్రబాబు అమిత్ షాను ఎందుకు కలుస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. త్వరలో కేంద్ర బడ్జెట్ సభలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అమిత్ షాను చంద్రబాబు కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏదైనా రాజకీయ కారణం ఉండొచ్చన్న అనుమానం కూడా ఉంది.
* రాజకీయ అంశాల కోసమే..
సాధారణంగా కేంద్రానికి సంబంధించిన రాజకీయ అంశాలను అమిత్ షా( home minister Amit Shah ) డీల్ చేస్తారు. ముందుగా ఆయన నోటిస్ కి వెళ్ళిన తరువాత బిజెపి పరంగా, కేంద్ర ప్రభుత్వపరంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కూటమిని టార్గెట్ చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అమిత్ షా ను చంద్రబాబు కలుస్తుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైనా ప్రాధాన్యత అంశం లేక పోతే.. చంద్రబాబు ఢిల్లీ సడన్ టూర్ ఉండదని తెలుస్తోంది. ఈ టూర్ వెనుక రకరకాల చర్చ నడుస్తోంది. అత్యవసరమైన రాజకీయపరమైన చర్చల కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
* బడ్జెట్ ప్రతిపాదనలతో..
కేంద్ర ప్రభుత్వం ( central government) బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఏపీకి అత్యవసరమైన ప్రతిపాదనలతో చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలతో అమిత్ షా కు సంబంధం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఆయన నెంబర్ 2 గా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఆయన పవర్ ఫుల్. అందుకే ఆయన ద్వారా ఏపీకి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబు పంపాలని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.
* వారిలో కలవరం..
చంద్రబాబు ఢిల్లీ ఆకస్మిక పర్యటన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. నిద్ర లేకుండా చేస్తోంది. అసలు చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? అమిత్ షాను ఎందుకు కలుస్తున్నారు? అనేది వైసీపీలో టెన్షన్. ఆ పార్టీ నేతల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎటువంటి ప్రకంపనలు రేపనుందో చూడాలి.