Kesineni Nani: ఎన్నికల సమీపిస్తున్న కొలదీ ఏపీలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి వైసిపి సంచలనాలకు తెరతీసింది. ఇప్పుడు ఆ వంతు టిడిపికి వచ్చింది. ఆ పార్టీలో సైతం సీట్ల రచ్చ ప్రారంభమైంది. ఈసారి విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీటు లేదని తేల్చేశారు. పార్టీ వ్యవహారాల్లో సైతం జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో నాని టిడిపిలో కొనసాగడం సందేహంగా కనిపిస్తోంది. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది.
గత రెండు ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాని స్వరం మారింది. తన సొంత బలంతో గెలిచినట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను ఏకపక్షంగా మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు. అటు కృష్ణా జిల్లాలో మిగతా టిడిపి నాయకులతో విభేదాలు పెట్టుకున్నారు. చంద్రబాబు కంటే తానే గొప్ప అన్న రీతిలో వ్యవహరించారు. చంద్రబాబుతో కొద్దిపాటి స్నేహాన్ని కొనసాగిస్తూనే లోకేష్ తో విభేదించారు. చివరకు ఆయన పాదయాత్రకు సైతం ముఖం చాటేశారు.
ఇటీవల తిరువూరు టిడిపి కార్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు టిడిపి హై కమాండ్ కు కోపం తెప్పించాయి. ఈనెల 7న తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ విజయవంతానికి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కేశినేని నాని అనుచరులు రచ్చ చేశారు. ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి దిగారు. దీనిని టిడిపి హై కమాండ్ సీరియస్ గా తీసుకుంది. ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమని భావించిన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ఎంపీ ని టిడిపి బాధ్యతలను తప్పించడానికి నిర్ణయించారు. ఇదే విషయాన్ని కేశినేనికి పార్టీ దూతల ద్వారా సమాచారం అందించారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ కేశినేని నాని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వెలుగులోకి వచ్చింది. టిడిపి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పారని.. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తన స్థానంలో వేరొకరిని నియమించారని సమాచారం ఇచ్చినట్లు కేశినేని చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కేశినేని సోదరుడు చిన్ని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతారని తెలుస్తోంది. ఇది నానికి మింగుడు పడడం లేదు. పైగా దేవినేని ఉమ, బుద్దా వెంకన్న తదితరులతో కేశినేని నానికి విభేదాలు ఉన్నాయి. వారికి లోకేష్ అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుండడంతో నాని తట్టుకోలేకపోతున్నారు. అందుకే లోకేష్ ను సైతం టార్గెట్ చేయడం ప్రారంభించారు. అయితే కేశినేని నాని విషయంలో చంద్రబాబు కొంతవరకు ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇటీవల నాని వ్యాఖ్యలు చేయి దాటుతున్నాయి. అందుకే పార్టీ నేతలను సంధానకర్తలుగా నియమించి నానిని కాస్తా వెనక్కి తగ్గాలని సూచించారు. అయితే దూకుడు మీద ఉన్న నాని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.