CM Chandrababu: చంద్రబాబు ఇదే స్వేచ్ఛను కొనసాగించాలి

టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు సీఎం అయ్యారు. మూడు పార్టీల నుంచి మంత్రులు అయ్యారు. 24 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

Written By: Dharma, Updated On : June 19, 2024 4:02 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు సైతం బాధ్యతలు స్వీకరించి పనులు మొదలుపెట్టారు. అయితే గత ఐదేళ్లలో చూడని దృశ్యాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. మంత్రులు తమ సొంత శాఖలపై దృష్టి పెట్టారు. తమ శాఖలో ప్రగతి, లోపాలపై స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఏపీలో మారిన ఈ పరిస్థితి చూసి విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు చివరి వరకు ఇదే స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకుంటున్నారు. మంత్రులు తమ సొంత శాఖల ప్రగతి పై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

గత ఐదు సంవత్సరాలుగా మంత్రులు తమ సొంత శాఖల కంటే రాజకీయాలపైనే ఎక్కువ మాట్లాడారు. తొలి క్యాబినెట్లో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, విస్తరణలో చోటు దక్కించుకున్న రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, జోగి రమేష్.. ఇలా అందరిదీ ఒకటే బాణి. తాము నిర్వర్తిస్తున్న శాఖల ప్రగతి కంటే వారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై విమర్శలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.తమ వద్ద ఒక శాఖ ఉందని, దాని ప్రగతి గురించి మాట్లాడదామని ఒక్కరంటే ఒక్కరు అనుకోలేదు. అసలు జగన్ స్వేచ్ఛ ఇచ్చారో… స్వేచ్ఛ ఇచ్చిన వీరు వినియోగించుకోలేదో అన్నది తెలియడం లేదు. అయితే వారు తమ శాఖల కంటే రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. క్యాబినెట్లో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పించి.. మిగతావారు ఓటమి చెందాల్సి వచ్చింది.

టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు సీఎం అయ్యారు. మూడు పార్టీల నుంచి మంత్రులు అయ్యారు. 24 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తొలినాళ్లలోనే మంత్రులు స్వేచ్ఛగా మాట్లాడుతుండడం విశేషం. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఏకంగా గోదాములను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అయితే ఆసుపత్రులను తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్యం, మౌలిక వసతులు గురించి ఆరా తీశారు. హోం మంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గంజాయి నియంత్రణ, నేరాల అదుపునకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. అయితే మంత్రులు రాజకీయాలుతక్కువ మాట్లాడి.. శాఖల ప్రగతి గురించి ఎక్కువ మాట్లాడితే ఈ రాష్ట్రానికి ప్రయోజనం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమ శాఖల గురించి బాహాటంగా మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.