Chennai: వైసీపీ ఎంపీ కుమార్తె అరెస్ట్.. ఏం జరిగిందంటే?

సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో కళాక్షేత్ర కాలనీ వరదరాజసాలైలో ఫుట్ పాత్ పై నిద్రపోయాడు. ఆ సమయంలో ఓ కారు ఫుట్ పాత్ పై దూసుకొచ్చింది.

Written By: Dharma, Updated On : June 19, 2024 4:32 pm

Chennai

Follow us on

Chennai: చెన్నైలో దారుణ ఘటన జరిగింది. వైసీపీ ఎంపీ కుమార్తె కారు ఢీకొట్టడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెసంట్ నగర్ కు చెందిన సూర్య అనే యువకుడు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో కళాక్షేత్ర కాలనీ వరదరాజసాలైలో ఫుట్ పాత్ పై నిద్రపోయాడు. ఆ సమయంలో ఓ కారు ఫుట్ పాత్ పై దూసుకొచ్చింది. ఈ ఘటనలో సూర్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు మహిళలు ఉన్నారు.కారు నడుపుతున్న మహిళ అక్కడ నుంచి కారుతో సహా పారిపోయారు.మరో మహిళ ప్రమాదం గురించి ప్రశ్నించిన స్థానికులతో గొడవకు దిగారు.అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఆ ఇద్దరు మహిళలు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించారు. అందులో దొరికినకారు వివరాలు ఆరా తీసే పనిలోపడ్డారు. ఆ ఇద్దరు మహిళల ఫోటోలను సైతం చూశారు.అయితే సోమవారం సాయంత్రం వరకు నిందితురాలిని అరెస్టు చేయకపోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించడంతో స్థానిక పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. కారు నడుపుతూ పట్టుబడ్డ మహిళ వైసిపి రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు కుమార్తె మాధురిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన సూర్యకు వివాహం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరగగా.. ఆలస్యంగా వెలుగు చూడడం విశేషం. ఈ ఘటనపై ఎంపీ మస్తాన్ రావు ఇంతవరకు స్పందించలేదు. పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా ప్రమాదం జరిగిన తర్వాత ఓ మహిళ స్థానికులతో వాగ్వాదానికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో అరెస్ట్ అయిన మాధురి కొద్దిసేపటికి బెయిల్ పై విడుదలైనట్లు ప్రచారం జరుగుతోంది.దీనిని పోలీసులు ధ్రువీకరించడం లేదు.