Chandrababu: చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒకవైపు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు మంత్రివర్గ కూర్పు ఒక కొలిక్కి వచ్చింది. నేడు సాయంత్రం చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి మంత్రులుగా ఎంపిక చేసిన ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వనున్నారు. దీంతో చంద్రబాబు ఫోన్ కోసం ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో.. కీలక అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. వాటిలో కొన్నింటికి సంబంధించి ఫైళ్లపై తొలి సంతకం చేయనున్నారు. ప్రధానంగా రెండు అంశాలు చర్చలో ఉన్నాయి. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై కాగా.. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ అని తెలుస్తోంది. జగన్ ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ స్థాయిలో వివాదాస్పదం అయ్యిందో తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే దానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో సంచలనం సృష్టించింది. ఆస్తుల శాశ్వత పరిరక్షణ కోసం ఈ యాక్ట్ రూపొందించినట్లు వైసిపి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ భూముల ధ్రువపత్రాలు ప్రభుత్వం తన వద్ద ఉంచుకొని.. జిరాక్స్ కాపీలు హక్కుదారులకు ఇస్తుందని.. ఇది భూములపై హక్కులను కాలరాసేందుకేనని విపక్షాలు ఆరోపించాయి. గతంలో ఏ ప్రభుత్వము చేపట్టని విధంగా.. భూములకు సంబంధించి ధృవీకరణ పత్రాలపై జగన్ బొమ్మ వేయడాన్ని కూడా తప్పుపట్టాయి. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికార పక్షానికి ముప్పు తిప్పలు పెట్టింది. ముఖ్యంగా పులివెందులలో.. సొంత పార్టీ మనుషులే జగన్ సతీమణి భారతిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నిలదీసినంత పని చేశారు. వైసిపి ఓటమికి ఇదే ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజల్లో ఒక రకమైన భయం ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టును రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ యాక్ట్ రద్దు ఫైల్ పై సంతకం చేయడానికి చంద్రబాబు డిసైడ్ అయ్యారు. దీంతో పాత పద్ధతిలోనే రైతుల భూ ధ్రువీకరణ పత్రాలు రానున్నాయి. అయితే ఈ యాక్ట్ పై వైసీపీ నేతలు స్పష్టమైన ప్రకటన చేసినా లాభం లేకుండా పోయింది. అందుకే ఈ యాక్ట్ ను రద్దుచేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే పెను వివాదం సృష్టించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు ఒక ముగింపు లభించినట్లే.