Chandrababu : టిడిపిలో సీటు దక్కని వారు అసంతృప్తిగా ఉన్నారు. వారిని బుజ్జగించాలి కానీ.. బాధ పెట్టకూడదు. అయితే ఈ విషయంలో చంద్రబాబు కాస్త కఠినంగానే ఉన్నారు. ఏకంగా అసంతృప్తి వాదులను చెడామడ తిట్టేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విశాఖలో అయితే ఓ మాజీ మంత్రిని.. తన బస్సులోనే తిడుతున్నట్లు ఓ ఫోటో వైరల్ అవుతోంది. అందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. బాధిత మాజీ మంత్రి నోరు విప్పితే కానీ.. దీని గురించి తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ బాధిత మాజీ మంత్రి ఎవరో కాదు.. బండారు సత్యనారాయణమూర్తి. ఆ మధ్యన మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. మళ్లీ ఈ మధ్యన ఆయన ఆశించిన పెందుర్తి సీటు దక్కకపోవడంతో మరోసారి మీడియాలో కనిపించారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. జనసేన పంచకర్ల రమేష్ బాబును అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాను ఆశించిన సీటు రాక.. చంద్రబాబును కన్విన్స్ చేయలేక మొన్న ఆ మధ్యన బండారు సత్యనారాయణమూర్తి ఆసుపత్రి పాలయ్యారు.అయినా ఏదో మార్పు జరిగి.. తనకు సీటు వస్తుందని బండారు సత్యనారాయణమూర్తి భావించారు. వైసీపీ నుంచి ఆహ్వానం ఉన్నా.. అల్లుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు టిడిపిలో ఉండడంతో.. ఆ పార్టీలోకి వెళ్లలేక పోయారు.
అయితే తనకున్న చనువుతో చంద్రబాబును తాజాగా కలిశారు బండారు సత్యనారాయణమూర్తి. ప్రజాగళం పేరిట చంద్రబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన విశాఖలో పర్యటించారు. ఆయనను కలిసేందుకు బండారు సత్యనారాయణమూర్తి వెళ్లారు. చంద్రబాబు బస చేస్తున్న బస్సులోకి వెళ్లి తన పెందుర్తి టికెట్ కోసం ప్రస్తావించారు. ఈ క్రమంలో చంద్రబాబు బండారు పై ఆగ్రహం వ్యక్తం చేశారని.. తిట్టిపోశారంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే అందులో చంద్రబాబు హావభావాలు చూస్తుంటే.. నిజంగానే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉంది. అసంతృప్తి వాదులను బుజ్జగించాలి తప్ప.. ఇలా తిట్టడం సరైన పద్ధతి కాదని.. వైసీపీ సోషల్ మీడియా తెగ పోస్టులు పెడుతోంది. అయితే చంద్రబాబు నిజంగా తిట్టారా? లేదా? అన్నది బండారు సత్యనారాయణమూర్తి నోరు తెరిస్తే గానీ తెలియదు. మరి ఆయన నోరు తెరుస్తారా? అధినేత పై ఆరోపణలు చేస్తారా? అన్నది తెలియాలి.