Homeఆంధ్రప్రదేశ్‌Sree city : శ్రీ సిటీకి క్యూ కడుతున్న పరిశ్రమలు.. కూటమి ప్రభుత్వం వరాలు.. చంద్రబాబు...

Sree city : శ్రీ సిటీకి క్యూ కడుతున్న పరిశ్రమలు.. కూటమి ప్రభుత్వం వరాలు.. చంద్రబాబు లక్ష్యం అదే

Sree city : కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి అడుగులు శరవేగంగా పడుతున్నాయి. పెట్టుబడుల కోసం కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి.అందులో భాగంగా తిరుపతి జిల్లాలోని సత్యవేడు శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలి లో పరిశ్రమలు భారీగా ఏర్పాటు అవుతున్నాయి. ఇక్కడ 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పడ్డాయి. సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రెడ్ జోన్లు వచ్చాయి. దాదాపు 220 కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం ఏర్పడింది.ఆటోమేటివ్,ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసిజి పరిశ్రమలు సైతం వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు సైతం ఏర్పాటయ్యాయి. ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, నాలుగు బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీ సిటీ లోని ప్రత్యేక ఆర్థిక మండలిని చంద్రబాబు సందర్శించారు. అక్కడ 1570 కోట్ల పెట్టుబడులతో.. 8,480 మందికి ఉద్యోగాల కల్పించే స్థాయిలో ఏర్పాటైన 15 పరిశ్రమలను ప్రారంభించారు. 900 కోట్ల పెట్టుబడులతో 200740 మందికి ఉద్యోగాలు కల్పించే ఏడు పరిశ్రమలకు భూమి పూజ చేశారు. అదేవిధంగా 1213 కోట్ల పెట్టుబడితో 4,060 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే మరో ఐదు పరిశ్రమల స్థాపనకు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొన్నారు.వివిధ కంపెనీలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఇందులో భాగస్వామ్యం చేశారు.ఈ సందర్భంగా పారిశ్రామికంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమని.. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని.. గతానికి భిన్నంగా మంచి వాతావరణం సృష్టిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.ఏపీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

* సీఈవోలతో భేటీ
శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓ లతో చంద్రబాబు భేటీ అయ్యారు. వారికి దిశ నిర్దేశం చేశారు. టిడిపి హయాంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు.హైటెక్ సిటీ నిర్మాణంలో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్య విధానాన్ని ప్రస్తావించారు.ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా భారతీయులు కనిపిస్తుండడం ఆనందంగా ఉందని..ప్రతి నలుగురిలో ఒకరు ఏపీ వారేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ పారిశ్రామిక లక్ష్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

* అత్యున్నత ఎకనమిక్ జోన్
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శ్రీ సిటీ మరోసారి వెలిగిపోయింది. ఒకవైపు చెన్నై,మరోవైపు కృష్ణపట్నం, ఇంకోవైపు తిరుపతి ఆధ్యాత్మిక ప్రాంతం.. శ్రీ సిటీకి దగ్గరగా ఉండడంతో.. ఇది అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా అవుతుందని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అందుకే శ్రీ సిటీ ఐజిబిసి గోల్డెన్ రేటింగ్ వచ్చేలా ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందిస్తోంది. శ్రీ సిటీలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన పై సైతం ప్రభుత్వం దృష్టి పెట్టింది. అనుకూలమైన నివాస ప్రాంతంగా శ్రీ సిటీని తీర్చిదిద్దుతామని..ముఖ్యంగా పచ్చదనాన్ని పెంపొందిస్తామని.. 100% వర్షం నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తమ ప్రభుత్వ లక్ష్యాలను వివరించే ప్రయత్నం చేశారు.

* పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట
విజన్ 2047లో శ్రీ సిటీ అభివృద్ధిని భాగస్వామ్యం చేశారు చంద్రబాబు. 2029 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని.. అందులో ఏపీ ని కీలక భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చంద్రబాబు ప్రకటించడం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగంపై ఎక్కువగా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఒకవైపు అమరావతి, ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యతాంశాలుగా తీసుకున్నారు. అదే సమయంలో పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారు.ఇప్పటికే ఉన్న శ్రీ సిటీని మరింత అభివృద్ధి చేసి పరిశ్రమల సంఖ్య పెంచాలన్నది చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version