Cases Againist IPS Officers:  ఆ వైసీపీ ఐపీఎస్ లపై రివెంజ్ తీర్చుకుంటున్న చంద్రబాబు సర్కార్.. ఏం స్కెచ్ గీసిందంటే

కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన వారిపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కొందరు అధికారులను పక్కన పెట్టింది. ఇప్పుడు వారిపై కేసులతో వెంటాడుతోంది.

Written By: Dharma, Updated On : August 29, 2024 8:12 pm

Cases Againist IPS Officers

Follow us on

Cases Againist IPS Officers:  ప్రభుత్వాలు మారినప్పుడు అధికారుల మార్పు సర్వసాధారణం.తమకు నచ్చి, మెచ్చిన అధికారుల నే తమ టీం లోకి తీసుకుంటారు. ఏపీలో తాజాగా జరిగింది ఇదే. అయితే ఇష్టం లేని అధికారులను అప్రాధాన్య పోస్టుల్లోకి పంపించడం ఆనవాయితీగా వస్తోంది.కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. చాలామంది అధికారులకు అసలు పోస్టింగులు ఇవ్వలేదు. ఐఏఎస్ లు అయితే సాధారణ పరిపాలన శాఖకు, ఐపీఎస్ లు అయితే డిజిపి కార్యాలయానికి సరెండర్ చేశారు. అంతటితో ఆగలేదు. చాలామంది అధికారుల చుట్టూ కేసులు వేలాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వారు అధికారులుగా కంటే.. వైసిపి నాయకులుగా వ్యవహరించారు. అందుకే ఇప్పుడు వారికి కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. ఏడుగురు అధికారుల పైన కేసులు ఉన్నాయి. వైసిపి హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా.. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వారంతా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ లు పివి సునీల్ కుమార్, కాంతిరాణా టాటా , విశాల్ గున్ని, కేకేఎన్ అన్బురాజన్, ఫకీరప్ప, సిహెచ్ విజయరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వీరిపై కేసుల కత్తి వేలాడుతోంది.

* రఘురామకృష్ణం రాజు ఫిర్యాదుతో ఇద్దరిపై
గత ప్రభుత్వం రఘురామకృష్ణం రాజును ఎలా వెంటాడిందో తెలిసిన విషయమే. వైసీపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఆయన. అదే పార్టీని విభేదించి తరచూ విమర్శలు చేసేవారు. అప్పట్లో ఆయనపై సిఐడి ఫోకస్ పెట్టింది. బలవంతంగా హైదరాబాదు నుంచి మంగళగిరి కార్యాలయానికి తెచ్చింది. తనపై దాడి చేశారని కూడా అప్పట్లో రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు. సొంత పార్టీ ఎంపీపై దాడి చేయించడం అప్పట్లో సంచలనం గా మారింది. ఇప్పుడు అదే రఘురామకృష్ణం రాజు అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఇంటలిజెన్స్ అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది.

* టిడిపి నేతల అరెస్టులో
ఇక పీఎస్ఆర్ ఆంజనేయులుపై ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయి. అప్పటి మాజీ మంత్రి అచ్చెనాయుడు, జెసి ప్రభాకర్ రెడ్డి.. ఇలా ఏ ఒక్క నేతను ఆయన విడిచిపెట్టలేదు. రకరకాలైన కేసులతో ఇబ్బంది పెట్టారు. బలవంతంగా అరెస్టు చేశారు. మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు ఒక ఐపీఎస్ అధికారి వేధింపులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వివాదాస్పద అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వలేదు.

* అలా దారికి తెచ్చుకోవాలని..
మొత్తం 19 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. వీరు ప్రతిరోజు డిజిపి కార్యాలయానికి హాజరు కావాల్సిందేనని పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే డిజిపి ఆదేశాలను పట్టించుకోకుండా వీరు కార్యాలయానికి రావడం లేదు. వీరి విషయంలో ఏం చేయాలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇంతలోనే పాత కేసులను తెరపైకి తీసుకువచ్చింది. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. మరో ఏడుగురు సైతం కేసుల్లో చిక్కుకున్నారు. వీరిని అలా దారికి తెచ్చుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది.