CM Chandrababu: టిడిపి అధినేత చంద్రబాబు( TDP chief Chandrababu ) అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు. సుదీర్ఘంగా నాలుగున్నర గంటలపాటు సమావేశం జరిగింది. రాష్ట్ర పురోగతిపై చర్చించారు. సంక్షేమ పథకాలతో పాటు పాలనపై చర్చ సాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై చంద్రబాబు సభ్యులకు స్పష్టతనిచ్చారు. మూడు పథకాల అమలుపై కీలక ప్రకటన చేశారు. మరికొన్ని సంక్షేమ పథకాలు విషయంలో సైతం స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ చాలా రకాల హామీలు ఇచ్చింది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ 8 నెలలు అవుతున్న ఇంతవరకు కీలక సంక్షేమ పథకాలకు అడుగులు పడడం లేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లో అసంతృప్తి ప్రారంభం కాకమునుపే పథకాలు అమలు చేయాలని కొంతమంది టీడీపీ నేతలు చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. అయితే సంక్షేమ పథకాలకు సంబంధించి తాము అన్ని రకాల కసరత్తులు చేస్తున్నట్లు చంద్రబాబు వారికి వివరించారు.
* జగన్ సర్కార్ చర్యల వల్లే
జగన్ సర్కార్( Jagan Mohan Reddy government) నిర్వాకం వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయిందని.. అందుకే సంక్షేమానికి అప్పులు కూడా దొరకని పరిస్థితి ఉందని చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నా జూన్‌లోగా సూపర్ సిక్స్ లోని మిగతా మూడు హామీల అమలు చేస్తామని చెబుతున్నారు చంద్రబాబు. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మే నెలలో తల్లికి వందనం పథకం, కేంద్రంతో కలిపి రైతులకు అన్నదాత సుఖీభవ కింద మూడు దఫాలుగా 20వేల ఆర్థిక సాయం అందిస్తామని పొలిట్ బ్యూరోలో స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరుతామంటూ చంద్రబాబు ప్రకటించారని తెలుస్తోంది.
* పథకాలపై ఫుల్ క్లారిటీ
ఇప్పటికే దీపం పథకాన్ని అమలు చేసి చూపించిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే సమయానికి తల్లికి వందనం ఇస్తున్నామని.. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ సొమ్ముతో కలిపి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 అందిస్తామని చంద్రబాబు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 లోపే మత్స్యకారులకు 20,000 రూపాయలు మృతి కింద అందిస్తామని వెల్లడించారు.
* అగ్రిగోల్డ్ బాధితులకు బాసట
అగ్రిగోల్డ్ ( agri gold ) బాధితుల విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. బాధితులకు త్వరలోనే ఒక పరిష్కార మార్గం చూపిస్తామని చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూములను.. బాధితులకు పరిహారం కింద ఇచ్చే యోచనలో ఉన్నామని.. దీనిపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఓ మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే శనివారం వినతులు స్వీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని.. అందుకే నియోజకవర్గాల్లో ఈ వినతుల స్వీకరణ అనేది జరగాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గత వైసిపి ప్రభుత్వంలో అక్రమంగా నమోదు చేసిన కేసుల కొట్టివేతకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో వీటికి సంబంధించి ఆదేశాలు జారీ చేయనున్నారు.