CM Chandrababu
CM Chandrababu : వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) రాజీనామా అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై వైసీపీ నేతలు ఎవరు ఇంతవరకు స్పందించలేదు. కానీ కూటమి నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజీనామా చేసినంత మాత్రాన విజయసాయిరెడ్డి చేసిన తప్పులు ఒప్పు అవుతాయా అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేసి పాపాలు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారా అని కొందరు నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అయితే విజయసాయిరెడ్డి విషయంలో భిన్నంగా కామెంట్స్ చేశారు. దావోస్ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విలేకరులు పదేపదే ప్రశ్నించే సరికి విజయసాయి రెడ్డి విషయంలో చంద్రబాబు స్పందించాల్సి వచ్చింది. అది వైసిపి అంతర్గత వ్యవహారం అంటూనే హాట్ కామెంట్స్ చేశారు సీఎం. అయితే విజయసాయి రెడ్డి మాత్రం చంద్రబాబుతో తనకు వ్యక్తిగత వైరం లేదని.. ఆయన కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చారు.
* ఈరోజు రాజీనామా సమర్పణ విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) నిన్న సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు సాయి రెడ్డి. రేపు రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ వెళ్లి నేరుగా రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంటనే రాజీనామాను ఆమోదించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుటుంబంతో తనకు వ్యక్తిగత వైరం లేదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తో చెన్నైలో ఉన్నప్పటి నాటినుంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నారు. తన రాజీనామాతో కూటమికి లాభమని చెప్పారు. మరోసారి తాను రాజకీయాల గురించి మాట్లాడనని.. కనీసం కామెంట్స్ చేయనని కూడా విజయసాయిరెడ్డి ఢిల్లీ వేదికగా ప్రకటించారు.
* స్పందించనంటూనే
అయితే ఈరోజు దావోస్ ( davos)పర్యటనకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. విజయసాయిరెడ్డి రాజీనామా అంశాన్ని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. పార్టీపై నమ్మకం ఉంటే ఉంటారు.. లేకపోతే వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు. అక్కడ పరిస్థితి అందుకు దోహదపడుతుందని.. అయినా అది పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ తేల్చి చెప్పారు. వ్యక్తిగత కోపంతో వ్యవస్థను నాశనం చేయడం ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు. అర్హత లేని వారు రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీ పరిస్థితిపై ఇంతకుమించి కామెంట్ చేయనని కూడా స్పష్టం చేశారు. సింగపూర్ వాళ్లకు కూడా జగన్ ప్రభుత్వం విధ్వంసం చూపించిందని.. అందువల్లే వారు రావడానికి విముఖత చూపుతున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
* గత ఐదేళ్లుగా టార్గెట్
గత ఐదేళ్ల వైసిపి( YSR Congress ) పాలనలో విజయసాయిరెడ్డి చాలా దూకుడుగా వ్యవహరించేవారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు ఆయన ఎంత ప్రాయశ్చిత్తం వ్యక్తం చేసినా టిడిపి నుంచి సానుకూలత రావడం లేదు. అయితే చంద్రబాబు కుటుంబం పై తనకు ఎటువంటి ద్వేషం లేదని చెప్పుకోవడం ద్వారా.. సరికొత్త సంకేతాలు పంపారు విజయసాయిరెడ్డి. నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డికి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. తారకరత్న భార్య స్వయాన తన వదిన కుమార్తె. తారకరత్న మరణించిన సమయంలో చంద్రబాబుతో విజయసాయి సన్నిహిత సంబంధాలు గడిపిన సందర్భాలు ఉన్నాయి. బహుశా వాటిని గుర్తుచేసుకునే విజయసాయిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే స్పందించనని అంటూనే చంద్రబాబు విజయసాయిరెడ్డి ఇష్యుపై హాట్ కామెంట్స్ చేశారు. అయితే అది విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చేసినది కాదని.. జగన్ పైనే అలా అన్నారని మరో ప్రచారం నడుస్తోంది. మున్మందు విజయ సాయి రెడ్డి విషయంలో తెలుగుదేశం స్టాండ్ ఎలా ఉండబోతుందో చూడాలి.