Chandrababu: ఎవరైనా ప్రజలకు మంచి పాలన అందిస్తామని చెబుతారు. ముందు ప్రభుత్వం చేయలేని పనులు పూర్తి చేస్తానని చెప్పుకొస్తారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి జగన్ మాట మార్చారు. నవరత్నాల్లో హామీ ఇచ్చి అమలు చేయడం మరిచిపోయారు. తానే సొంతంగా ప్రభుత్వ దుకాణాలు నడుపుతున్నారు. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తున్నారు. అయితే నిషేధిస్తానన్న జగన్ ఫెయిల్ అయ్యారు. ఆ హామీని చేసి చూపిస్తానని చెప్పడం లేదు. నాణ్యమైన మద్యం అందిస్తానని చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నెలకొంది. చంద్రబాబు ప్రజాగలం పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. జగన్ తీరును తప్పుపడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తును జగన్ అంధకారంలో నెట్టారని ఆరోపిస్తున్నారు. అయితే మద్య నిషేధం గురించి ప్రస్తావించడం లేదు. కేవలం నాసిరకం మద్యం అమ్మకాలను సాగిస్తున్నారని.. అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరో 50 రోజులు ఆగితే సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తానని ప్రజలకు చెబుతున్నారు. పదేపదే అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు.
అయితే ఓ సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు ఈతరహా ప్రకటనలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నాణ్యమైన చదువు అందిస్తానని చెప్పవచ్చు. నాణ్యమైన వైద్యం అందిస్తామని చెప్పవచ్చు. కానీ ఈ మద్యం విషయం ప్రస్తావించడంపై సెటైర్లు పడుతున్నాయి. ‘తాగండి.. తాగి ఊగండి.. అనారోగ్యానికి గురికండి అన్నట్టుంది చంద్రబాబు వ్యవహార శైలి. ఒకవేళ మీరు తాగి అనారోగ్యానికి గురైనా ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. అతిగా తాగి ప్రాణాలు కోల్పోతే.. మీ కుటుంబంలో ఉన్నవారికి పింఛన్లు అందిస్తాం’ అని ప్రకటించవచ్చు కదా అని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన సీనియర్ నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఈ తరహా ప్రకటనలు చేయడాన్ని తప్పు పడుతున్నారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానన్న జగన్ మాట మార్చడం నిజం. గత ఐదేళ్లుగా నాసిరకం మద్యం విక్రయాలు చేయడం వాస్తవం. అధిక ధరకు అమ్మడం కూడా అందరికీ తెలిసిన నిజం. ఇలాంటి వైఫల్యాల గురించి మాట్లాడవచ్చు కానీ.. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చంద్రబాబు చెప్పడం మాత్రం ఆయన స్థాయికి తగినది కాదు.