Chandrababu Pawan Kalyan bond: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. సంక్షేమ పథకాలతో పాటు మెరుగైన పాలన అందిస్తూ కూటమి ముందుకు సాగుతోంది. కానీ క్షేత్రస్థాయిలో కొన్ని రకాల ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య విభేదాలకు చాలామంది నేతలు కారణం అవుతున్నారు. అయితే తమ పార్టీల ఆధిపత్యం కోసం నియోజకవర్గస్థాయిలో గట్టిగానే నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అటువంటి నాయకులను పట్టించుకునే స్థితిలో లేవు టిడిపి,జనసేనలు. నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల గోడును వింటే కచ్చితంగా రాష్ట్రస్థాయిలో పొత్తులు చిక్కుల్లో పడినట్టే. అందుకే చంద్రబాబుతో పాటు పవన్ అటువంటి నాయకుల గోడును వింటున్నారే తప్ప… సత్వర చర్యలకు దిగడం లేదు. టిడిపికి వ్యతిరేకంగా జనసేన నేతలు.. జనసేన నేతలకు వ్యతిరేకంగా టిడిపి నాయకులు తమ పార్టీ నాయకత్వాలకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు కానీ.. హై కమాండ్లు మాత్రం పట్టించుకోని పరిస్థితిని గుర్తించాలి.
పిఠాపురం విషయంలోనే..
పిఠాపురంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వర్మ రకరకాల రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో టిడిపి ఇబ్బంది పడుతోందని.. ఇలానే ముందుకు సాగితే పార్టీ బతకదని తేల్చి చెబుతున్నారు. సీఎం చంద్రబాబుకు సైతం నియోజకవర్గంలో ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన ఆవేదనను చంద్రబాబు విని పట్టించుకునే స్థితిలో లేరు. ఒకవేళ విన్నా కలుగజేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటువంటి చోట కలుగ చేసుకుంటే విభేదాల పర్వం పెరుగుతుందే కానీ తగ్గదు రాష్ట్రస్థాయిలో. అది అంత మాత్రం కూటమికి తగదు. ఆపై కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ దూకుడు ప్రదర్శిస్తే వచ్చే ఇబ్బందులు చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన వర్మను పిలిచి మందలించారే తప్ప.. ఆయన చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోలేదు.
పవన్ సైతం నిర్మొహమాటంగా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అలానే కఠినంగా ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన నేతల విషయంలో టిడిపి ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న తీరుపై కూడా ఆయనకు ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ పవన్ దూకుడు ప్రదర్శించడం లేదు. సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. అయితే టిడిపి తో తాడోపేడో అన్న నేతల విషయంలో.. అడ్డగోలుగా కూటమి విఘాతం కలిగించే నాయకుల విషయంలో పవన్ కఠినంగానే ఉంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది జనసేన నేతలు కూటమి విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటువంటివారు అవసరం లేదన్నట్టు పవన్ తేల్చి చెప్పడం ద్వారా.. చంద్రబాబుతో తన బంధాన్ని.. కూటమితో జనసేన బంధాన్ని స్ట్రాంగ్ గా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.