Chandrababu : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు మరోసారి ఎన్నికయ్యారు. మహానాడు వేదికగా ఈరోజు జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు చంద్రబాబు. పార్టీ నేతలతో పాటు శ్రేణులు నివాళులు అర్పించారు. అనంతరం నిన్న ప్రవేశపెట్టిన తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో మైలరాళ్లను అధిగమించి ఈ స్థానానికి చేరుకుందని కొనియాడారు. మరో నాలుగు దశాబ్దాల పాటు తెలుగు నాట తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ నేత వర్ల రామయ్య ప్రకటించారు. దీంతో ఒక ప్రాంతీయ పార్టీకి 30 ఏళ్ల పాటు అధ్యక్షత వహిస్తూ రికార్డు సృష్టించారు చంద్రబాబు.
Also Read : లోకేష్ టీం రెడీ.. ఎవరెవరు అంటే?
* 1995లో తొలిసారిగా..
1995లో తొలిసారిగా టిడిపి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. 1995 ఆగస్టు సంక్షోభంలో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా స్వీకరించారు. అప్పటి నుంచి పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా అధ్యక్ష పదవిలో మాత్రం చంద్రబాబు కొనసాగుతూ వచ్చారు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో జాతీయ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు చంద్రబాబు. ఏపీ, తెలంగాణకు వేరువేరుగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. కానీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను మాత్రం చంద్రబాబు నిర్వర్తిస్తూ వచ్చారు. నందమూరి తారక రామారావు 1982 నుంచి 1995 వరకు.. 13 సంవత్సరాల పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలను చూశారు. కానీ చంద్రబాబు మాత్రం ఏకంగా మూడు దశాబ్దాల పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చూడడం విశేషం.
* సరికొత్త రికార్డు..
అయితే చంద్రబాబుకు ఒక్క అధ్యక్ష బాధ్యతలే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న సీఎంగా రికార్డు సృష్టించారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా కూడా రాణించారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన.. పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. ఐదేళ్లపాటు నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. ఒక పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రికార్డు చెరపరానిది.