China Economy : ప్రపంచ ఆర్థిక రంగంలో ఒక సంచలనాత్మక మార్పు చోటుచేసుకోనుందా? ‘చైనా ఆర్థిక వ్యవస్థ ఒక సబ్బు బుడగలా పేలిపోయే దశలో ఉంది, భారత్ అతి త్వరలోనే సూపర్ పవర్‌గా అవతరిస్తుంది’ అనే చర్చ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల వెలువడిన అనేక విశ్లేషణలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ తన ఆర్థిక వృద్ధి రేటులో భారీ మందగమనాన్ని ఎదుర్కొంటుండగా, భారత్ మాత్రం అద్భుతమైన వృద్ధిని సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ పరిణామాలు ప్రపంచ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో తెలుసుకుందాం.
చైనా జీడీపీ పతనం
చైనా 2024 జిడిపి గణాంకాల్లో అధికారికంగా 5శాతం వృద్ధిని ప్రకటించింది. కానీ, నిజానికి చైనా వృద్ధిరేటు కేవలం 3శాతం లోపే ఉండే అవకాశం ఉందని రోడియం గ్రూప్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ వ్యత్యాసం చైనా ఆర్థిక వ్యవస్థలో లోతైన సమస్యలను సూచిస్తోంది. ముఖ్యంగా, చైనాలో పెద్ద మొత్తంలో ఆర్థికంగా వెనుకబాటుతనం కనిపిస్తోంది. ఆ దేశం ఆర్థిక మందగమనం వైపు పయనిస్తోందనడానికి స్పష్టమైన సంకేతం. ఏప్రిల్ 2025లో చైనా పారిశ్రామిక ఉత్పత్తి 6.1శాతంపెరిగినట్లు పేర్కొన్నప్పటికీ, వాస్తవానికి వినియోగదారుల డిమాండ్ మాత్రం 5.1శాతం మాత్రమే ఉంది. దీనికి ప్రధాన కారణం వినియోగదారుల నుంచి డిమాండ్ పెద్ద ఎత్తున తగ్గడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. డిమాండ్ తగ్గడం అంటే ఉత్పత్తి తగ్గడం, తద్వారా నిరుద్యోగం పెరగడం అని అర్థం.
వాణిజ్య యుద్ధం, పరిశ్రమల తరలింపు
చైనాలో నిరుద్యోగం భారీగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా, యాపిల్ (Apple) వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ తయారీ యూనిట్లను చైనా నుంచి భారత్, వియత్నాం వంటి దేశాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇది చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదాహరణకు, యాపిల్ సంస్థ చైనాలో ఐఫోన్ల తయారీ ద్వారా సుమారు 50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు యాపిల్ తయారీ ఇతర దేశాలకు తరలి వెళ్లడం అంటే చైనాలో నిరుద్యోగం మరింత పెరగడమే. చైనాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే ఈ తరలింపులకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
భారత్ జిడిపి దూకుడు
మరోవైపు, భారత్ జిడిపి విషయంలో చైనాను వెనక్కి నెట్టి దూసుకుపోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ జిడిపి వృద్ధి రేటు 6.3శాతం గా ఉంటుందని అంచనా వేస్తున్నారు, ఇది చైనాతో పోలిస్తే చాలా ఎక్కువ. ముఖ్యంగా, అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లయితే, చైనాతో సంబంధాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
అంతేకాకుండా, భారత్ ప్రపంచంలోనే పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగా కూడా చైనాను భారత్ అతి త్వరలోనే ఆర్థిక అభివృద్ధి పరంగా వెనక్కు నెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ బలమైన ఆర్థిక పునాదులు, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్, సానుకూల పెట్టుబడి వాతావరణం దేశాన్ని భవిష్యత్తులో గ్లోబల్ సూపర్ పవర్‌గా మార్చగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.