CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) అభివృద్ధితో పాటు సంక్షేమం సమాంతరంగా నడుస్తోంది. అదే సమయంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ సంస్థలతో పాటు పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో కొంతమంది కూటమి ఎమ్మెల్యేల పనితీరు పుణ్యమా అని ఈ ప్లస్ మైనస్ గా మారుతోంది. అందుకే సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. రాజకీయంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. అవసరం అనుకుంటే కొంతమందిని వదులుకునేందుకు కూడా ఆయన వెనుకడుగు వేసే చాన్స్ కనిపించడం లేదు. ముందుగా ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు హెచ్చరిస్తారు. వినకపోతే చంద్రబాబు సీరియస్ యాక్షన్ లోకి దిగుతారు. ప్రభుత్వం పై సానుకూలత కనిపిస్తున్న తరుణంలోనే చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* అప్పట్లో పథకాలు ప్రారంభించినా..
2019లో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). ఆ ఎన్నికలకు ముందు నవరత్నాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చింది మొదలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందడంతో ప్రజల్లో సంతృప్తి కనిపించింది. ఈ దశలో నవరత్నాల్లో చెప్పని హామీలను సైతం అమలు చేయడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో మరింత ఆకర్షవంతులయ్యారు. అదే సమయంలో కరోనా కష్టకాలం. ఉపాధి గగనమవుతున్న వేళ.. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు కొండంత అండగా నిలిచాయి. అయితే కోవిడ్ తర్వాత ప్రజల ఆదాయ వనరులు పెరిగాయి. ఆ సమయంలో ప్రజల్లో సంక్షేమ పథకాలు కంటే అభివృద్ధి కోసం వెతుకులాట ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే చిన్నపాటి అసంతృప్తి మొదలైంది. అనతి కాలంలోనే అది పతాక స్థాయికి చేరింది. అదే సమయంలో ఎమ్మెల్యేలను కాదు.. తనను చూసి ఓటు వేస్తారని జగన్మోహన్ రెడ్డి భ్రమించారు. కానీ ఆయన ఒకటి తలిస్తే.. ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. దారుణమైన ఓటమిని కట్టబెట్టారు.
* అన్నీ చేస్తున్నామంటే కుదరదు..
అందుకే ఇప్పుడు చంద్రబాబు( CM Chandrababu) ఈ విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అన్నింటికీ మించి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచుతున్నాం. ఇది ఒక్కటే సరిపోదు. ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగుండాలి. ప్రజలతో క్షేత్రస్థాయిలో సంబంధాలు కలిగింది వారే. అందుకే జగన్మోహన్ రెడ్డి గుర్తించని ఈ అంశాన్ని.. చంద్రబాబు ముందుగానే గుర్తించారు. పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని భావిస్తున్నారు. ముందుగా ఇంచార్జ్ మంత్రులకు ఆ బాధ్యతలు అప్పగించారు. తరువాత తానే నేరుగా రంగంలోకి దిగనున్నారు. ముందుగానే చంద్రబాబు ఈ పరిస్థితిని గమనించడం నిజంగా అభినందించదగ్గ విషయం. మరి దీంట్లో ఎంతవరకు వర్కౌట్ చేసుకుంటారో చూడాలి.