Chandrababu: చంద్రబాబు నాయుడు (CBN) .. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో మంచి డిమాండ్ ఉన్న నేత. 18వ లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేసిన టీడీపీ.. 16 ఎంపీ సీట్లు గెలిచింది. బీజేపీ 3, జన సేనను 2 స్థానాల్లో గెలిపించారు చంద్రబాబు. ఇక రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తెచ్చారు. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తాజా ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సీట్లు(272) చేరుకోలేకపోయింది. మరోవైపు ఇండియా కూటమి కూడా భారీగా పుంజుకుంది. ఆ కూటమికి 234 సీట్లు వచ్చాయి. బీజేపీ ఒంటరిగా 244 స్థానాలు గెలిచింది. ఈ నేపథ్యంలో టీడీపీ సీట్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా మారాయి.
టీడీపీ మద్దతు కోసం..
ఎన్నికలకు ముందే.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. టీడీపీ ఎన్‌డీఏలో చేరింది. ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి కూడా అనుకూలంగా వచ్చాయి. కూటమికి 244 స్థానాలు రావడంతో మరికొందరిని తమవైపు తిప్పుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబుతోపాటు, బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌ను ఇండియా కూటమిలోకి రప్పించే ప్రయత్నాలు జరిగాయి.
పాత ఫొటో వైరల్..
ఈ క్రమంలో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయకుడు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఇద్దరూ మంతనాలు జరుపుతున్నట్లు ఉంది. దీంతో చంద్రబాబు ఇండియా కూటమివైపు మొగ్గుచూపుతున్నాడా అన్న సందేహాలు వచ్చేలా వైరల్ చేస్తున్నారు. ఇది ఎన్డీఏ కూటమిలో కలవరం రేపింది. అయితే ఈ ఫొటో తాజాది కాదని, 2019లో చంద్రబాబు నాయుడు యూపీలో అఖిలేష్‌ను కలిసిన ఫొటో అని తెలుపడంతో ఎన్డీఏ పక్షాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు ఆ. ఫొటోకు సంబంధం లేదని చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చారు. తమతో కలవలేదని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ ఫొటోను వైరల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.