NTR Centenary Celebration : చంద్రబాబు ప్లాన్ అదుర్స్..ఒకే వేదికపై టాలీవుడ్ అగ్ర హీరోలు

సరిగ్గా ఎన్నికల వేళ చంద్రబాబు అదును చూసి కొట్టినట్టయ్యింది. అందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఎన్టీఆర్ మైలేజీని.. తద్వారా టీడీపీకి పొలిటికల్ గా గెయిన్ చేయనున్నారన్న మాట. 

Written By: Dharma, Updated On : May 19, 2023 11:01 am
Follow us on

NTR Centenary Celebration :  2024 ఎన్నికలకు చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉండడంతో అస్త్రశస్త్రాలతో సిద్ధపడుతున్నారు. గత ఎన్నికల్లో ఉన్న ప్రతికూలాంశాలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వైపు పొత్తులు కుదుర్చుకోవడంతో పాటు నందమూరి కుటుంబాన్ని అన్నిరకాలుగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ నెలలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి, మహానాడు కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇదే వేదికలపై అరుదైన కలయికను ఆవిష్కృతం చేసి పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలని చూస్తున్నారు.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ద్వారా నందమూరి అభిమానులు ఒడిసిపట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. విజయవాడలో జరిగిన వేడుకలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయన ప్రసంగాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోయింది. రజనీపై ఎదురుదాడి చేసింది. దీంతో ఈ నెల 20న హైదరాబాద్ లో నిర్వహించనున్న వేడుకలకు అంతకు మించి చేపట్టాలని చంద్రబాబు డిసైడయ్యారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ఒకేవేదికపైకి తెచ్చి వైసీపీకి ఝలక్ ఇవ్వాలని భావిస్తున్నారు.

ఈ నెల 20న జరగనున్న వేడుకలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నిర్వహణా కమిటీ నందమూరి కుటుంబంతో పాటుగా పలువురు సినీ ప్రముఖలను ఆహ్వానించింది. ఎన్టీఆర్‌ సమగ్ర సినీ, రాజకీయ జీవితంపై ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన ‘శక పురుషుడు’ ప్రత్యేక సావనీర్‌ను, అదేవిధంగా ఎన్టీఆర్‌ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ వేడుకల్లో ఆవిష్కరిస్తారు.

పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులకు కార్యక్రమానికి ఆహ్వానించారు.  హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ కార్యదరి్శ  సీతారామ్‌ ఏచూరి, దగ్గుబాటి పురందీశ్వరి, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ , కన్నడ చిత్ర హీరో శివకుమార్‌ ,  జూనియర్‌ ఎన్టీఆర్‌ , అల్లు అర్జున్‌, ప్రభాస్‌, దగ్గుబాటి వెంకటేష్‌, సుమన్‌, మురళీ మురళీమోహన్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌, జయప్రద, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు జి. ఆదిశేషగిరి రావు, సి. అశ్వనీదత్‌ తదితర ప్రముఖులు పాల్గొంటున్నారు. వీరు ఎన్టీఆర్ గురించి ప్రసంగించనున్నారు.

అటు నందమూరి కుటుంబమంతా ఒకే వేదికపైకి రానుంది. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. విజయవాడ వేడుకలకు ఆహ్వానం అందలేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రభస చేశారు. అందుకే ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ముందస్తు కార్యక్రమాలు ఫిక్సయ్యాయి. అతడి హాజరు డౌటేనన్న వార్తలు వచ్చాయి. కానీ తోటి నటులు రానుండడం, తాత గారి కార్యక్రమం కావడంతో తారక్ హాజరు అనివార్యంగా మారింది. సరిగ్గా ఎన్నికల వేళ చంద్రబాబు అదును చూసి కొట్టినట్టయ్యింది. అందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఎన్టీఆర్ మైలేజీని.. తద్వారా టీడీపీకి పొలిటికల్ గా గెయిన్ చేయనున్నారన్న మాట.