AP governance update: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఒక విజినరీతో ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధిని మరింత పురోగతి దిశగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారికి దిశ నిర్దేశం చేశారు. ఏపీ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక ప్రణాళికను వివరించారు. ప్రపంచంలో భారత్ అగ్రగామిగా నిలవాలన్న లక్ష్యంతో మోడీ పనిచేస్తున్నారని.. అదే స్ఫూర్తితో ఏపీని మరింతగా అభివృద్ధి చేసి చూపిద్దామంటూ కలెక్టర్లకు పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండు రోజులపాటు జరగనున్న ఈ కలెక్టర్ల సదస్సు ఏపీకి మరో గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దేనికైనా సంస్కరణలు ముఖ్యమైన అభిప్రాయం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయని గుర్తు చేశారు.
స్వర్ణాంధ్ర విజన్ తో
కేంద్ర ప్రభుత్వం( central government) ప్రతిష్టాత్మకంగా వికసిత్ భారత్ ప్రాజెక్టును తీసుకున్న సంగతి తెలిసిందే. 2047 వికసిత్ భారత్ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తే.. ఏపీ ప్రభుత్వం 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించింది. అయితే దీనికోసం అధికారులు గట్టిగానే కృషి చేయాలని చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో దిశా నిర్దేశం చేశారు. ఈ స్వర్ణాంధ్ర విజన్ అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తులను నియామకాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సామాజిక న్యాయంతో మంత్రివర్గాన్ని కూర్చామని.. ఇది రాష్ట్ర అభివృద్ధి కోసమేనని చెప్పుకొచ్చారు.
జీఎస్టీ ఆదాయం మెరుగు..
ఏపీలో ఇటీవల జీఎస్టీ( GST) ఆదాయం పెరిగిన సంగతి తెలిసిందే. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు జీఎస్టీ ఆదాయం కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో రూ.29 లక్షల జీఎస్టీపి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పుకొచ్చారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకే అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రధాని, సీఎంల తరువాత కలెక్టర్ లే అత్యంత కీలకమైన వ్యక్తులని.. అందుకే ప్రభుత్వంతో భాగస్వామ్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. మొత్తానికి అయితే పాలనా బాధ్యతలను కలెక్టర్ల పై పెట్టారు సీఎం. తద్వారా వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
ఆ ఫిర్యాదులతోనే..
అయితే ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. చాలా జిల్లాల్లో కలెక్టర్లను ఎమ్మెల్యేలు లెక్కచేయడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. అయితే స్వర్ణాంధ్ర విజయంతో ముందుకెళ్తున్న చంద్రబాబు మాత్రం కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. దీనిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే కలెక్టర్లకు స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా.. పాలనను మరింత పారదర్శకం చేసేందుకు అవకాశం కలుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే కలెక్టర్లకు స్వేచ్ఛపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి. పాలనలో రాజకీయ ప్రమేయం తగ్గుతుందా? లేదా? అన్నది కొద్ది నెలల్లో తెలియనుంది.