Train: ఓ రైలు తిరుపతికి వేగంగా వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ద్విచక్ర వాహనంపై తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా వేగంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం దర్యాపూర్ రైల్వే గేటు వద్ద చోటుచేసుకుంది. గేట్ కీపర్ వెంటనే స్పందించి రైలు సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రైలును ఆపారు. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు దక్కాయి. బైక్ నడుపుతున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో రైలు అరగంట పాటు నిలిచిపోయింది. అసలు ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటో తెలియరాలేదు.
నవీపేట మండలం దర్యపూర్ రైల్వేగేట్ దగ్గరలో ఓ వ్యక్తి తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా స్పెండర్ బైక్ పై వేగంగా దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతడిని గేట్ కీపర్ గమనించాడు.. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి ట్రైన్ పైలట్ కు సమాచారం చేరవేశాడు.. దీంతో అప్రమత్తమైన ఫైలట్ రైలును ఆపారు. రైలును ఆపడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం కాపాడారు. బైక్‌ను నడిపిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు బైక్ నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిజామాబాద్ ఆఫీసుకు తరలించారు.
దేశంలో ఇటీవల వరుసగా రైలు పట్టాలపై ప్రమాదకర వస్తువులను ఉంచి రైళ్లను బోల్తా కొట్టించే కుట్రలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పట్టాలపై రైలు ప్రమాదాలు చేసేందుకు అగంతకులు చేస్తున్న పలు ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలు వంటి వస్తువులను ట్రాక్‌లపై ఉంచుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ ప్రాంతంలో వెలుగు చూసింది. పిలిభిత్-బరేలీ రైల్వే ట్రాక్‌పై దాదాపు 25 అడుగుల పొడవున్న ఇనుప రాడ్‌ను రైల్వే సిబ్బంది గుర్తించారు. రైల్వే కార్యకలాపాలను దెబ్బతీసేందుకు సంఘ వ్యతిరేక శక్తులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయి.
దీనికంటే ముందు యూపీలోని రాంపూర్ సమీపంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ రోడ్-రుద్రపూర్ సిటీ ట్రాక్‌పై లోకో పైలట్ దాదాపు ఆరు మీటర్ల పొడవున్న ఇనుప స్తంభాన్ని గుర్తించి రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరో ఘటనలో హర్యానాలోని ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కలంది ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు.
గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 24 ఇలాంటి ఘటనలు నమోదయ్యాయని భారతీయ రైల్వే తెలిపింది. ఇందులో ఆగస్టులో 15, సెప్టెంబర్‌లో మూడు ఘటనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో సంఘటనలు నమోదవగా, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కుట్రలు వెలుగులోకి వచ్చాయి. రైల్వే భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.