Chandrababu Naidu : ప్రకృతి విపత్తుల సమయంలోనే ప్రభుత్వాల సమర్థత బయటపడుతుంది. ప్రకృతి విపత్తులను ఎదుర్కోలేము కానీ.. వాటి నష్టాన్ని కొంత నియంత్రించగలం. నష్ట తీవ్రతను తగ్గించగలం. ముఖ్యంగా మనుషుల ప్రాణాలను కాపాడగలం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తోంది అదే. భారీ ప్రళయ భీకర వాయుగుండం ఏపీ వైపు దూసుకొస్తుంది. కోస్తా జిల్లాల మీదుగా తీరం దాటనుంది. అదే జరిగితే కోస్తా జిల్లాలకు అపార నష్టం తప్పదు. అయితే ఈ నష్ట నియంత్రణకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో సీఎం చంద్రబాబుకు అపార అనుభవం ఉంది. గతంలో విశాఖలో హుద్ హుద్, శ్రీకాకుళంలో తితలి ప్రభావం చూపిన క్రమంలో ఆ జిల్లాలను దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా యధా స్థానానికి తీసుకురావడంలో చంద్రబాబు కృషి ఉంది.
* పూర్వస్థితికి విశాఖ
విశాఖ( Visakhapatnam) చూడచక్కటి నగరం. పచ్చదనం తివాచీ పరిచినట్టు ఉంటుంది. ఎటు చూసినా పచ్చని మొక్కలు,చెట్లు సాగర నగరానికి ఆభరణాలుగా ఉంటాయి. అటువంటి నగరాన్ని హుద్ హుద్ కాకా వికలం చేసింది. ఆ సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు చంద్రబాబు. అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారు. విశాఖలో పచ్చదనం పోకుండా ఆయన గట్టి చర్య లే చేపట్టారు. ఎక్కడైతే పచ్చని చెట్టు, మొక్క పోయిందో.. అదే చోట సాంకేతికతతో నాటించారు. ఆరు నెలల వ్యవధిలోనే విశాఖను పూర్వస్థితికి తీసుకొచ్చారు.
* తితలి సమయంలో..
శ్రీకాకుళం జిల్లాను( Srikakulam district) తితలి తుఫాన్ అతలాకుతలం చేసింది. పక్కనే ఉన్న ఒడిస్సా పై కూడా విపరీతమైన ప్రభావం చూపింది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి డివిజన్ దారుణంగా నష్టపోయింది. అదే సమయంలో ఒడిస్సా లోని గంజాం, గజపతి జిల్లాలకు సైతం నష్టం జరిగింది. కానీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో వారం రోజులు పాటు ఉండిపోయారు. మంత్రులతో పాటు అధికార యంత్రాంగాన్ని దింపారు. ఇక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారు. నష్టపోయిన రైతులతో పాటు ప్రజలకు భారీగా పరిహారం అందించారు. అనతి కాలంలోనే వారు కోలుకునేలా చేశారు.
* ముందస్తు హెచ్చరికలు..
అయితే తాజాగా మొంథా తుఫాన్ నేపథ్యంలో అదే తరహా చర్యలు చేపడుతున్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా హై అలర్ట్ ఉన్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఎక్కువ ప్రభావం చూపునున్న జిల్లాలకు ఇప్పటికే నిధులు కేటాయించారు. అప్పటికప్పుడు ఖర్చు చేసేలా అధికారులకు స్వేచ్ఛనిచ్చారు. ఎస్ టి ఆర్ ఎఫ్ తో పాటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను నియమించారు. విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించి సంబంధిత శాఖ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. మొత్తానికి అయితే తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతను, సమర్థతను చాటుతోంది ఏపీ ప్రభుత్వం.