Chandrababu-Pawan Kalyan: ఏపీలో( Andhra Pradesh) గత కొద్ది రోజులుగా ఒక రాజకీయ పరిణామం వివాదంగా మారింది. అసెంబ్లీలో బాలకృష్ణ ప్రసంగం తర్వాత పూర్తిగా సీన్ మారింది. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో చిరంజీవి విషయంలో బాలకృష్ణ వెటకారంగా మాట్లాడారని ఆయన అభిమానులు బాధపడ్డారు. బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత అంతే వేగంగా చిరంజీవి స్పందించారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు స్టార్ హీరోలు కావడం.. బాలకృష్ణ టిడిపి నేత కావడం.. చిరంజీవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కావడంతో.. ఇది రాజకీయ వివాదంగా మారిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాత.. ఈ వివాదం కాస్త నెమ్మదించింది. తెర వెనుక చాలా రకాల పరిణామాలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి.
ఫ్యాన్స్ మధ్య వార్..
వాస్తవానికి నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై మాత్రమే మాట్లాడారు. సినీ పరిశ్రమ విషయంలో చిరంజీవి గట్టిగా అడిగిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి స్పందించారని అప్పటి రోజులను గుర్తు చేశారు. అయితే అది తప్పు అనేలా మాట్లాడారు బాలకృష్ణ. అప్పట్లో ఎవరు గట్టిగా అడగలేదు అంటూ.. చిరంజీవి ప్రస్తావన తేకుండానే వెటకారంగా మాట్లాడారు. సహజంగా మృదుస్వభావి అయిన చిరంజీవి దీనిపై అంతే వేగంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలతో మెగా అభిమానులు సైతం రంగంలోకి దిగారు. తమ హీరోను అంటారా అంటూ ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బాలకృష్ణ ఏం చేశారని? కనీసం చిరంజీవి ప్రస్తావన తేలేదని.. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాత్రం మాట్లాడారని చెప్పుకొచ్చారు. క్షమాపణలు చెప్పరని తేల్చి పారేశారు. దీంతో ఈ వివాదం పెను దుమారంగా మారింది.
అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగింపు..
అయితే కేవలం తన వ్యాఖ్యలతోనే అపార్ధాలు చోటుచేసుకున్నాయని భావించి కామినేని శ్రీనివాస్( Kamini Srinivas ) అసెంబ్లీలో ఒక విజ్ఞప్తి చేశారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అందుకు సమ్మతించారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వాటిని రికార్డుల నుంచి తొలగించారు. శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అదే సమయంలో చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. దీంతో ఎక్కడి వారు అక్కడ మౌనంగా ఉండి పోయారు. ఒకే ఒక్క భేటీతో ఈ వివాదాన్ని ఇద్దరూ నేతలు ముగించారన్న టాక్ వినిపిస్తోంది.
ఏకాంత సమావేశం తో..
పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ వివాద క్రమంలో పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు వెళ్లారు చంద్రబాబు. అక్కడ తప్పకుండా చిన్నపాటి ప్రస్తావన వచ్చి ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారిద్దరూ చర్చించి ఉంటారు. అయితే ఈ ఘటనకు బ్రేక్ ఇవ్వాలంటే కొంతసేపు ఏకాంత భేటీ అవసరం. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ చేసింది అదే. మొత్తానికి అయితే ఈ వివాదాన్ని కొలిక్కి తేగలిగారు ఆ ఇద్దరు నేతలు.