Chandrababu Mahanadu Speech: నేల ఈనిందా? ఆకాశం చిల్లుబడిందా? అన్నట్టు కడపలో మహానాడుకు పసుపు సైన్యం పోటెత్తింది. రాయలసీమలో టీడీపీ గర్జించింది. మహానాడు మూడో రోజు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జనంతో కడప నగరం పసుపెక్కింది. నేతల ప్రసంగాలు, పంచ్ డైలాగులు, ప్రత్యర్థులకు సవాళ్లు.. ఇలా అన్నింటికీ వేదిక అయ్యింది మహానాడు. అధినేత చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్త వరకూ అందరూ పాలుపంచుకున్నారు వేదికపై. మూడు రోజుల పాటు వేడుకలకు హాజరైన పార్టీ శ్రేణులకు పసందైన వంటకాలతో రాయలసీమ ఆతిథ్యాన్ని చూపించారు. అక్కడ సౌకర్యాలను చూసి సామాన్య కార్యకర్త సైతం ఫిదా అయ్యారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఎంపిక చేసిన నేతలు మాట్లాడారు. మహానాడు గొప్పతనం, ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు పనితీరు, లోకేష్ యువ నాయకత్వంపై నాయకులు ఎక్కువగా మాట్లాడారు.
అధినేత ప్రసంగంతో కేరింతలు..
నేతలంతా మాట్లాడిన తరువాత పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. ముందుగా కడప ప్రజలకు అభినందనలు తెలిపారు. రాయలసీమలో వైసీపీకి దారుణంగా ఓడించిన విషయాన్ని ప్రస్తావించారు. రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడు స్థానాలు ఇస్తే.. కడప ప్రజలు టీడీపీ కూటమికి ఏడు స్థానాల్లో గెలిపించిన విషయాన్ని గుర్తుచేశారు. రాయలసీమలో 52 స్థానాలకుగాను టీడీపీ కూటమి 45 స్థానాల్లో విజయం సాధించినట్టు తెలిపారు. అందుకే రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు తనవంతు పాత్ర తప్పకుండా పోషిస్తానని చెప్పారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులను అనుసంధానం చేసి రాయలసీమ స్వరూపాన్నే మార్చుతానని.. అది తన ఆశయమని చెప్పుకొచ్చారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం తన జీవిత ఆశయంగా చెప్పారు. విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. వైనాట్ గొడ్డలిపోట్లు అనేది తమ విధానం కాదన్నారు.ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తన ఆశయమన్నారు. తెలుగువాడు ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీకి తిరుగులేదన్నారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు టీడీపీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగాన్ని విన్నారు.
ఉత్తేజం నింపిన యువనేత..
నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. మాస్ జాతరగా మహానాడును పేర్కొన్నారు. పౌరుషాల గెడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోందని చూపించారు. తిరుమల తొలి గడప దేవుని కడపలో మహానాడును నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. 2024లో 93 శాతం స్ట్రైక్ రేటుతో ప్రత్యర్థికి రుచి చూపించాం. అసలు టీడీపీ ఉండదన్నారు. జెండా పీకేయాలని చూశారు. కానీ వారే అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. వైనాట్ 175 అని సౌండ్ చేశారు. కానీ సౌండ్ లో లేకుండా పోయారు అంటూ లోకేష్ పంచ్ ల మీద పంచ్ లు వేశారు. దీంతో టీడీపీ శ్రేణులు కరతాళ ధ్వనులతో ఆహ్వానించాయి. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును గుర్తుచేశారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును జైల్లో పెడితే ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డికి లాక్ చేశారని చెప్పారు. టీడీపీ నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు.. ట్రెండ్ ను సెట్ చేస్తారంటూ పవన్ డైలాగును గుర్తుచేస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. సీబీఎన్ అంటే ప్రజల ధైర్యం, నమ్మకమంటూ తన ప్రసంగాన్ని ముగించారు నారా లోకేష్.
కడప టీడీపీకి అభినందనల వెల్లువ..
మహానాడు విజయవంతంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. వేలాది వాహనాలు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నాయి. అయితే ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం చక్కటి సమన్వయంతో పనిచేసింది. అటు టీడీపీ కమిటీలు సైతం క్రియాశీలకంగా పనిచేశాయి. సుమారు 1500 మంది వంటగాళ్లు.. అహోరాత్రులు పనిచేసి లక్షలాది మందికి భోజనాలు అందించారు. ఈ విషయంలో కడప టీడీపీ నాయకత్వం ప్రత్యేకంగా అభినందనలు అందుకుంటోంది. మహానాడు విజయవంతం కావడంతో పార్టీ కేడర్ లో జోష్ నెలకొంది.