CM Chandrababu: హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు( Hindu Sanatan Dharm parirakshana ) బలమైన వ్యవస్థ అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. పవన్ పిలుపునకు జాతీయస్థాయిలో సైతం స్పందన వచ్చింది. ఏపీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన భారీ సమావేశంలో పీఠాధిపతులు, స్వామీజీలు ఇదే అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. హిందూ దేవాలయాలు, దేవస్థానాలు ట్రస్టుల పరిధిలోకి తేవాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు సైతం సనాతన ధర్మ రక్షణకు గాను ఆలయాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పడం విశేషం.
* ఆది నుంచి పవన్ అదే బాట
హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించి పవన్ కళ్యాణ్( Pawan Kalyan) తరచూ మాట్లాడుతుంటారు. ఇతర మతాల మాదిరిగానే హిందూ ధర్మం కూడా విస్తరించాలని.. ఎదుటి మతాన్ని గౌరవిస్తూనే.. హిందూమతం కూడా బలోపేతం కావాలని.. అందుకు ఒక వ్యవస్థ రావాలని ఆకాంక్షించారు పవన్. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. మెట్ల మార్గం గుండా నడిచి వెళ్లి మరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సనాతన ధర్మ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయ సందర్శన కూడా చేశారు. కేరళ తో పాటు తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. హిందూ మతం తో పాటు హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలపై పవన్ కళ్యాణ్ బాగానే స్పందిస్తున్నారు. ఈ అంశంతోనే కేంద్ర పెద్దలకు మరింత దగ్గరవుతున్నారు.
* ఆ నాలుగు మతాల పాత్ర కీలకం
అయితే ఇప్పుడు చంద్రబాబు ( Chandrababu) కూడా సనాతన ధర్మం అంటూ వ్యాఖ్యానిస్తుండడం విశేషం. సనాతన ధర్మ పరిరక్షణలో హిందూ, జైన, సిక్కిజం, బౌద్ధం కీలక పాత్ర పోషించాలని గుర్తు చేశారు చంద్రబాబు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని.. ఆదాయ వనరులను కూడా గుర్తు చేశారు. తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో 2025ను చంద్రబాబు ప్రారంభించారు. అంత్యోదయ ప్రతిష్ట సమస్త దీనిని ఏర్పాటు చేయగా.. మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ప్రమోద్ సావంత్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. టెంపుల్ టౌన్ తిరుపతిని జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులను సజావుగా.. శ్రీవారి దర్శనాన్ని కల్పించడంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని దేశ ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలతో పాటిస్తుండడం వల్లే దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
* చంద్రబాబు వ్యాఖ్యల వెనుక..
అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ( Pawan Kalyan)ఇప్పటివరకు సనాతన ధర్మం అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో హిందూ సమాజంలో ఆయన పై గౌరవం పెరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సైతం అదే బాట పట్టడం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చినట్లు అయింది. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అయితే సనాతన ధర్మ పరిరక్షణ డిమాండ్ పెరుగుతుండడం విశేషం.