Chandrababu Legal Mulakat: చంద్రబాబుకు సంబంధించి లీగల్ ములాఖత్ లు తగ్గించడానికి కారణం ఏంటి? జైలులో ఉండి వ్యూహాలు రూపొందిస్తున్నారన్న భయమా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. స్కిల్ స్కాం లో చంద్రబాబు అరెస్టు అయ్యి దాదాపు 40 రోజులు సమీపిస్తోంది. కోర్టుల్లో ఊరట దక్కడం లేదు. అత్యున్నత న్యాయస్థానంలో వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ, వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వులో ఉంది.ఈ తరుణంలో రోజుకు ఉన్న రెండు లీగల్ ములాఖత్ లను జైలు అధికారులు తగ్గించడం విశేషం.
సాధారణంగా జైలులో ఉండే నిందితుడిని కలిసేందుకు కుటుంబ సభ్యులు, మిత్రులకు ములాఖత్ లో అవకాశం ఇస్తారు. వారానికి రెండుసార్లు కలిసే ఏర్పాటు చేస్తారు. అటు లీగల్ ములాఖత్ ల్లో లాయర్లు కలిసేందుకు అవకాశం ఉంటుంది. రోజుకు రెండుసార్లు ఇలా కలిసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే చంద్రబాబు విషయంలో ఆ నిబంధనను పక్కనపెట్టారు. రోజుకు ఒక్క లీగల్ ములాఖత్ కే జైలు అధికారులు పరిమితం చేశారు. నిత్యం న్యాయవాదులు చంద్రబాబును కలుస్తుండడంతో ఖైదీలు ఇబ్బంది పడుతున్నారన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా జైళ్ళ శాఖ డిఐజి కి కలిసి ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు కేసులకు సంబంధించి ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు విచారణలు కొనసాగుతున్నాయి. ఒక్క స్కిల్ స్కాం కేసే కాదు. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసు.. ఇలా అన్ని రకాల కేసులతో చంద్రబాబును సిఐడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏకకాలంలో కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు విచారణలు కొనసాగుతున్నాయి. కనీసం కేసుల సంఖ్య దృష్ట్యా అయినా లీగల్ ములాఖత్ ల మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ జైలులో ఖైదీలకు అసౌకర్యం కలుగుతుంది అన్న సాకుతో ములాఖత్ ల్లో కోతలు విధించడం ఏమిటని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నాయి. దీనిపై గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాయి.
చంద్రబాబు కేసుల విచారణకు దాదాపు 58 మంది లాయర్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కోసం ఇంతమంది న్యాయవాదులు పనిచేస్తున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. వారి లెక్కనే తీసుకున్నా ఈ లాయర్లు చంద్రబాబును రోజుకు ఒకేసారి కలవాలనుకోవడం సాధ్యం కాదు. అందుకే ఈ కోతలు విధించి కుట్ర చేస్తున్నారని టిడిపి వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 2000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. సిబ్బంది చూస్తే అరకొరగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత జైలుకు వీఐపీల తాకిడి పెరిగింది. భద్రత పెంచాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో తరచూ న్యాయవాదులు కలుస్తుండడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని జైలు సిబ్బంది చెబుతున్నారు. మొత్తానికైతే లీగల్ ములాఖత్ ల్లో కోత విధించడంతో.. ఇదో రాజకీయ వివాదంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.