Chandrababu Arrest: అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది. ఇరువైపులా బలమైన వాదనలు జరుగుతున్నాయి. అయితే అసలైన అవినీతి అంశం పక్కదారి పట్టింది. ఆయన అరెస్టులో నిబంధనలు పాటించలేదని అంశంపైనే వాదనలు జరగడం విశేషం. ప్రధానంగా 17a సెక్షన్ వర్తిస్తుందా? లేదా? అనే అంశం చుట్టూనే అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగడం విశేషం.
స్కిల్ స్కాం లో రూ.371 కోట్ల అవినీతి జరిగిందని సిఐడి చెబుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి.. అరెస్టుల పర్వం కొనసాగించడంతో.. సిఐడి ఎంటర్ అయ్యింది. వందల కోట్ల రూపాయల అవినీతి జరిగితే అంశం పక్కకు వెళ్లి.. ఇప్పుడు అరెస్టుల్లో నిబంధనలు పాటించారా లేదా అన్నది మాత్రమే హైలెట్ కావడం విచారకరం. ఈ కేసులో ఆది నుంచి టెక్నికల్ అంశం చుట్టూనే విచారణ జరగడం విశేషం. దాదాపు రిమాండ్ కు తరలించి నెల రోజులు అవుతున్నా.. సహేతుకమైన కారణాలు, అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యం వంటి వాటితో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన తన కేసుల కొట్టివేతకే ప్రాధాన్యమిస్తున్నారు. తాను ఎక్కువ రోజులు జైల్లో ఉండడం ద్వారా ప్రజల సానుభూతి పొందవచ్చు అన్నది కూడా ఒక వ్యూహంగా తెలుస్తోంది.
తొలుత ఈ నెల మూడున చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఇరు వర్గాల వారు వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ కేసు ఎప్పుడు మొదలైంది? ఎఫ్ ఐ ఆర్ నమోదు ఎప్పుడు జరిగింది? చంద్రబాబు పేరుని ఎప్పుడు చేర్చారు? వంటి అంశాలపై విచారణ జరిగింది. 371 కోట్ల రూపాయల అవినీతి అంశం మాత్రం పక్కకు మళ్ళింది. అటు అత్యున్నత న్యాయస్థానం సైతం 17 ఏ సెక్షన్కు మాత్రమే ప్రాధాన్యమిస్తూ విచారణ చేపట్టడం విశేషం. కేసుకు మూలమైన అవినీతి అన్నదానిని పరిగణలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
వాస్తవానికి ఈనెల తొమ్మిదిన ఈ కేసునకు సంబంధించి తూర్పు వెల్లడిస్తారని అంతా భావించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం దీనిని హై ప్రొఫైల్ కేసుగా భావిస్తోంది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా కేసు పెట్టారన్నది వాస్తవం. ప్రజా ప్రతినిధుల అవినీతి అంశం కాబట్టి.. ఈ కేసు తీర్పు కోసం దేశం ఎదురుచూస్తోంది. అందుకే అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘ వాదనలకు అవకాశం ఇచ్చింది. ఈరోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ సాగనుంది. అయితే ఇదే అదునుగా న్యాయమూర్తులు లేవనెత్తిన కొన్ని అంశాలను హైలెట్ చేస్తూ ఎల్లో మీడియా ప్రత్యేక కథనాలను వండి వార్చడం విశేషం. చంద్రబాబు కేసులు సెక్షన్ 17 ఏ వర్తించేలా కనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించినట్లు టిడిపి అనుకూల మీడియా కథనాలను ప్రచురించింది. ఇవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అవినీతిని వదిలి టెక్నికల్ అంశాలు చుట్టూ వాదనలు జరగడం ఏమిటన్న చర్చ బలంగా నడుస్తోంది.