Chandrababu Latest News: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. సీనియర్ నేత కావడంతో ఆడే మాట ఎంత ప్రభావం చూపుతుందో ఆయనకు తెలుసు. ఒక సందర్భంలో వ్యవసాయం దండగ అన్న మాట చంద్రబాబు అన్నారని రాజకీయ ప్రత్యర్థులు దశాబ్దాల పాటు వెంటాడారు. దళితుల విషయంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా కొన్నేళ్లపాటు ప్రభావం చూపాయి. నేతల నోటి నుంచి తప్పుడు మాటలు ఎప్పుడు దొర్లుతాయా? అని వేచి చూసే రోజులు ఇవి. అందుకే చంద్రబాబు లాంటి నేతలు ఆ అవకాశం ఇవ్వకూడదని భావిస్తుంటారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు చాలా ఇంటర్వ్యూలు, ఎన్నికల సభల్లో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చాలా సమావేశాల్లో మాట్లాడారు. అయితే ఇలా పార్టీ విధానాలను.. ప్రభుత్వ పాలసీల గురించి గొప్పగా చెప్పుకున్నారు. కానీ చంద్రబాబు సుపరిపాలనకు తొలి అడుగు సభలో మాత్రం ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు.
పెద్దరికంతో మాటలు
చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా ఆయనకు తెలుసు. కానీ నిన్న జరిగిన సభలో ఆయన మాటలు పెద్దరికాన్ని గౌరవించేలా ఉన్నాయి. ఏడాది పాలనలో తాము అన్నీ చేశామని చెప్పుకోవడం లేదు అంటూ నిజాయితీగా మాట్లాడారు. అసలు చంద్రబాబు నుంచి ఆ మాట ఎవరూ ఊహించలేదు కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే మాట్లాడుతుంటారు. అదే రాజకీయ వ్యూహం విధానం గా భావిస్తారు. కానీ తొలి ఏడాది పాలన మీద విశ్లేషిస్తూ చాలా విషయాలు చెప్పారు. ఏడాదిలోనే అన్నీ చేశామని నేను చెప్పడం లేదు.. ఊహించిన దానికంటే ఎక్కువ చేశామని చంద్రబాబు ఉన్నది ఉన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అలా చెప్పడం ద్వారా తన రాజకీయ అనుభవాన్ని, పెద్దరికాన్ని కూడా చాటుకున్నారు. ప్రజలకు వాస్తవాలు చెబితే.. వాస్తవ పరిస్థితులు చెబితే కొంత అర్థం చేసుకుంటారని భావించి చంద్రబాబు ఈ మాటలు అని ఉంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: YS Jagan vs Chandrababu : సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 13 ప్రశ్నలు
సూపర్ సిక్స్ పథకాలపై సైతం
చంద్రబాబు సూపర్ సిక్స్ ( super six) హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో కొన్నింటిని అమలు చేశారు. మరికొన్నింటిని అమలు చేయలేకపోయారు. సహజంగానే రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. అయితే ఈ విషయంలో సామాన్య జనాల నుంచి సైతం చాలా రకాల అభ్యంతరాలు వస్తుండడంతో.. వాస్తవాలు తెలియచెప్పేందుకే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏపీలో దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉందని.. కేంద్రం సహకారం లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని కూడా సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు. తనకు ఈ పరిస్థితి తొలిసారి కాదని.. 1995 ప్రాంతంలో ఉమ్మడి ఏపీలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. దానిని తట్టుకొని నిలబడ్డామని కూడా చెప్పుకొచ్చారు. ఏపీ ఇబ్బందుల్లో ఉందని.. కనీసం రాజధాని లేకపోతే బస్సులో ఉంటూ పాలించిన రోజులను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
వైసిపి వైఫల్యాలు చెబుతూనే..
గత వైసిపి( YSR Congress ) ప్రభుత్వ వైఫల్యాలను విడమర్చి చెప్పారు చంద్రబాబు. తాను ఇచ్చిన హామీలను కొంతవరకు అమలు చేసి.. మిగతా వాటి విషయంలో ఎందుకు అమలు చేయలేదో కూడా పరోక్షంగా వివరించే ప్రయత్నం చేశారు. తాను ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉండగా విజన్ 20 20 డాక్యుమెంట్ తయారు చేశానని.. ఇప్పుడు విజన్2047 అందులో భాగమేనని వివరించే ప్రయత్నం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేపేందుకు అలా మాట్లాడారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా తమ పాలనలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను కూడా ప్రస్తావించి మరి బయట పెట్టడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు తన పెద్దరికాన్ని చాటుకున్నారు.