https://oktelugu.com/

Chandrababu: రఘురామ కోసం చంద్రబాబు తిప్పలు అన్నీ ఇన్నీ కావు

ముఖ్యంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గత ఐదేళ్లుగా విపక్షాలకు మించి జగన్ పై రఘురామకృష్ణంరాజు పోరాడారు. ఆయనకు సీటు లేకుంటే అది పరోక్షంగా జగన్ విజయం గా చెప్పవచ్చు.

Written By:
  • Dharma
  • , Updated On : April 13, 2024 / 11:40 AM IST

    Chandrababu

    Follow us on

    Chandrababu: ఏపీలో నామినేషన్ల పర్వానికి సమయం దగ్గరపడుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పట్టుమని నాలుగు రోజుల వ్యవధి కూడా లేదు. దీంతో కూటమి నేతలు ఫైనల్ టచ్ ఇస్తున్నారు. చేర్పులు, మార్పులను పూర్తిచేసి.. నామినేషన్లు, ప్రచార పర్వాన్ని ముమ్మరం చేయాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి తో పాటు బిజెపి జాతీయ నేతలు సమావేశమయ్యారు. మూడు పార్టీల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించారు. ఒక నిర్ణయానికి వచ్చి బిజెపి హై కమాండ్ కు ప్రతిపాదనలు తెలియజేశారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేర్పులు మార్పులు చేసి.. ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చేర్పులు మార్పులకు సంబంధించి ఈరోజు సాయంత్రం ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

    ముఖ్యంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గత ఐదేళ్లుగా విపక్షాలకు మించి జగన్ పై రఘురామకృష్ణంరాజు పోరాడారు. ఆయనకు సీటు లేకుంటే అది పరోక్షంగా జగన్ విజయం గా చెప్పవచ్చు. అందుకే రఘు రామ కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పటికే నరసాపురం ఎంపీ సీటును వదులుకుంటే.. బిజెపికి ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని విడిచిపెడతామని చంద్రబాబు ఆఫర్ చేశారు. ఇప్పుడు కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. నరసాపురం ఎంపీ సీటును టిడిపికి విడిచిపెడితే.. ఉండి అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి కేటాయిస్తామని బిజెపి పెద్దలతో చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే నరసాపురం ఎంపీ సీటును రఘురామకృష్ణం రాజుకు, ఉండి అసెంబ్లీ సీటును భూపతి రాజు శ్రీనివాస శర్మకు కేటాయిస్తారని తెలుస్తోంది.

    ప్రస్తుతం ఉండికి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. ఆయనకే టిడిపి హై కమాండ్ టికెట్ ప్రకటించింది. కానీ రఘురామకృష్ణం రాజు కోసం సర్దుబాటు చేస్తారని తెలిసిన నాటి నుంచి టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు అదే రఘురామకృష్ణంరాజుకు నరసాపురం సర్దుబాటు చేసేందుకు.. బిజెపికి ఉండి అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే వారు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు అనపర్తి సీటును టిడిపికి కేటాయిస్తే.. తంబాళ్లపల్లి సీటును బిజెపికి కేటాయిస్తామని చంద్రబాబు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బిజెపి అధినాయకత్వాన్ని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని పురందేశ్వరి తో పాటు జాతీయ నాయకులు స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తానికైతే చేర్పులు మార్పులకు సంబంధించి ఫైనల్ చేసి.. ఇక ప్రచారంలోకి అడుగు పెట్టాలని మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.