CM Chandrababu: సోషల్ మీడియా వ్యతిరేకులపై ఉక్కు పాదం.. చంద్రబాబు సంచలనం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై సైతం ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పై నిఘా పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం విశేషం.

Written By: Dharma, Updated On : October 6, 2024 11:27 am

CM Chandrababu

Follow us on

Chandrababu: దేశంలో సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ మీడియా లేనంత హైప్ క్రియేట్ చేస్తోంది. అందుకే ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియా పై ఆధారపడుతూ వస్తోంది. అయితే అదే రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలోకి వస్తే మరోలా సోషల్ మీడియా విషయంలో వ్యవహరిస్తుండడం విశేషం. సోషల్ మీడియాలో ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అందుకే ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేస్తోంది. ప్రతిపక్షం అధికారపక్షం పై బురదజల్లేందుకు.. అధికార పక్షం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, దుష్ప్రచారాన్ని నియంత్రించేందుకు సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నాయి. తాజాగా ఏపీలో సోషల్ మీడియా ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటుంది. ప్రభుత్వ పథకాలతో పాటు పాలనపై విపక్ష సోషల్ మీడియా టార్గెట్ చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోంది. ముఖ్యంగా ఇసుక విధానంలో కూటమి ప్రభుత్వ తీరును వైసీపీ సోషల్ మీడియా ఎండగడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు మంచి ఉద్దేశంతో అందిస్తున్న ఉచిత ఇసుకపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిఅధికారులను ఆదేశించారు.

* ప్రతి పార్టీకీ ఓ విభాగం
ప్రస్తుతం ఏపీలో ప్రతి రాజకీయ పార్టీకి సోషల్ మీడియా విభాగాలు ఉన్నాయి. వాటిపై కోట్లాది రూపాయల ఖర్చు పెడుతున్నారు. ఇప్పటివరకు వైసీపీకి సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా బాధ్యతలను చూసేవారు.తాజాగా గంగిరెడ్డి అనే వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించారు జగన్.టిడిపి సైతం సోషల్ మీడియా విభాగాన్ని బాగానే బలోపేతం చేసింది. గతంలో చింతకాయల విజయ్ లీడ్ చేసేవారు. ఇప్పుడు చాలామంది బాధ్యతలు వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సహజంగా ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సైతం అదే తరహా ప్రచారం చేస్తున్నారు.

* ఇసుక విధానంపై దుష్ప్రచారం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని ప్రకటించింది. పేరుకే ఉచితం కానీ రవాణా చార్జీల రూపంలో గతం కంటే ఎక్కువ భారం పడుతుందన్న విమర్శ ఉంది. దీనిపై ముప్పేట ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో వైసీపీ సోషల్ మీడియా దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇసుక విధానం పేరుకే ఉచితమని.. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారంటూ ప్రచారం చేస్తోంది. ఇది కూటమి ప్రభుత్వానికి మైనస్ గా మారింది. అందుకే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సోషల్ మీడియా ప్రచారంపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు.