CM Chandhrababu : వరద సహాయ చర్యలు కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారా? ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని భావించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓ మంత్రి సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అయింది. శివారు ప్రాంతాలు ఇంకా వరద ముంపు లోనే ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సత్ఫలితాలు ఇవ్వడం లేదు. విజయవాడ కలెక్టరేట్లో బస చేసిన చంద్రబాబు నిరంతరం సమీక్షలతో పాటు బాధితుల పరామర్శలకు వెళ్లారు.బాధితులకు ఆహార పదార్థాలు అందించే ఏర్పాట్లు చేశారు.అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విజయవాడ నగరం సాధారణ స్థితికి వచ్చేవరకు తాను ఇక్కడే ఉంటానని చెప్పుకొచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ బృందాలను రప్పించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సహాయ చర్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. బాధితులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో చంద్రబాబు సైతం అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. వారికి క్లాస్ పీకారు. సహాయ చర్యల్లో ఫెయిలయ్యామని అభిప్రాయపడ్డారు. తానే స్వయంగా రంగంలోకి దిగినా.. మొద్దు నిద్ర వీడరా? అంటూ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఒక వైపు బాధితులకు అండగా నిలిచామని ప్రభుత్వపరంగా ప్రకటిస్తూనే.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
* ఆ అధికారుల వల్లే
వరద సహాయ చర్యల్లో అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించారని.. కానీ వైసీపీ అనుకూల అధికారులు విధుల్లో ఉన్నచోట సహాయ చర్యల్లో విఫలమయ్యారంటూ ఓ మంత్రి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారుల కారణంగానే ఆహార పంపిణీలో జాప్యం జరిగిందని తెలుస్తోంది. నాడు జగన్ భక్త అధికారులుగా ముద్రపడి.. వైసీపీతో అంట కాగిన కొందరు అధికారులు డ్యూటీలో ఉన్న చోట ఈ సమస్య తీవ్రంగా ఉందని గుర్తించింది ప్రభుత్వం. ఆహార పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగానే ఆ అధికారులు వ్యవహరించారని తెలుసుకొని ప్రభుత్వం.
* స్వచ్ఛందంగా ముందుకు వస్తే
అయితే వీఆర్ లో ఉన్న కొందరు అధికారులు తమంతట తాము వరద సహాయ చర్యల్లో పాల్గొంటామని ముందుకు రావడంతో వారిని నియమించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే వారు సహాయ చర్యలను నిర్లక్ష్యం చేశారని సీఎం చంద్రబాబు సమీక్షలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా వీఆర్లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి, విజయరావ్, రఘువీరారెడ్డి, శ్రీకాంత్, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి కొందరు అధికారులకు అక్కడ డ్యూటీలు వేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి సదరు మంత్రి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఆయా అధికారులు విధుల్లో ఉన్న ప్రాంతంలో ఆహార పంపిణీలో జరిగిన జాప్యం పై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
* చంద్రబాబు శ్రమంతా వృధా
వరద ముంపు నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి విజయవాడ కలెక్టరేట్లోనే చంద్రబాబు బస చేశారు. ఒకవైపు ఇతర జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు జరుపుతూనే.. విజయవాడలో ముంపు బాధిత ప్రాంతాలను చంద్రబాబు సందర్శించారు. రాత్రి 11 గంటల సమయంలో సైతం ముంపు ప్రాంతాల పరామర్శకు వెళ్లారు. వేకువ జామున నాలుగు గంటల వరకు అక్కడే గడిపారు. మళ్లీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలకు బయలుదేరారు. అయితే కొందరు అధికారుల వ్యవహార శైలితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. అటువంటి అధికారులపై కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More