Chandrababu: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో వైసీపీ దూకుడు మీద ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం టిడిపి జనసేనతో పొత్తు పెట్టుకుంది. బిజెపి తమ కూటమిలోకి వస్తుందని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ కూటమి 99 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కొద్ది రోజుల కిందట చంద్రబాబుతో పాటు పవన్ ఒకే వేదిక పైకి వచ్చి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 94 చోట్ల, జనసేన ఐదు చోట్ల పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. మిగతా సీట్ల విషయంలో త్వరలో స్పష్టత రానుంది. అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత రెండు పార్టీల్లో అసంతృప్తి కనిపించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒకచోట అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకోవడం విశేషం.
తొలి జాబితాలో చాలామంది సీనియర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారి పేర్లు తొలి జాబితాలో కనిపించలేదు. దీంతో సీనియర్లలో ఓ రకమైన అసంతృప్తి నెలకొంది. దీంతో వారికి సర్దుబాటు చేయడం చంద్రబాబుకు అనివార్యంగా మారింది. పొత్తులో భాగంగా మిగతా రెండు భాగస్వామ్య పక్షాలకు సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉండడంతో.. కొన్ని కుటుంబాలకు ఒకటే టికెట్ అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలలో ఏదో ఒక సీటు మాత్రమే ఇవ్వగలనని సమాచారమిచ్చారు. అందుకు అనుగుణంగానే అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అయితే ఒకరిద్దరు సీనియర్ల వినతి మేరకు, పార్టీ అవసరాలు మేరకు కొన్నిచోట్ల మార్పు అనివార్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్నూలు జిల్లా డోన్ స్థానానికి ధర్మవరం సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. కానీ ఇక్కడ అభ్యర్థిని మార్చాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన బలమైన అభ్యర్థి కావడంతో.. ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అయితే మంచి అభ్యర్థి అవుతారని భావిస్తున్నారు. అయితే కోట్ల కుటుంబీకులు కర్నూలు ఎంపీ స్థానంతో పాటు ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. చంద్రబాబు మాత్రం కోట్ల కుటుంబీకులు డోన్ లో బరిలో దిగితే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే అక్కడ అభ్యర్థి మార్పుపై ధర్మవరపు సుబ్బారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి లను పిలిపించి మాట్లాడుతున్నారు.
అయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆశిస్తున్నట్టు ఆలూరు అసెంబ్లీ స్థానం దక్కే అవకాశం లేదు. అక్కడ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. టికెట్ హామీ తోనే ఆయన టిడిపిలో జంప్ అవుతున్నట్లు సమాచారం. మరోవైపు కర్నూలు ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీ సంజయ్ కుమార్ కు ఇస్తారని తెలుస్తోంది. ఆయన సైతం వైసీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వైసీపీకి బలమైన జిల్లాగా పేరొందిన కర్నూలులో పక్కా వ్యూహంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. టిక్కెట్లు ఖరారు చేస్తున్నారు. మరి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.