Chandrababu : నాడు రెడ్లు.. నేడు కమ్మ సామాజిక వర్గం.. టీటీడీలో జగన్ ను అనుసరిస్తున్న చంద్రబాబు

ముందు ప్రభుత్వం అనుసరించిన విధానాలను.. తరువాత వచ్చిన ప్రభుత్వం పాటించకపోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ జగన్ అనుసరించిన విధానాన్ని టీటీడీ విషయంలో చంద్రబాబు అమలు చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Written By: Dharma, Updated On : July 28, 2024 12:33 pm
Follow us on

Chandrababu : గత ఐదేళ్ల వైసిపి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నియామకాలపై రకరకాల విమర్శలు వచ్చాయి. ముఖ్యమైన నియామకాలన్నీ రెడ్డి సామాజిక వర్గంతో నింపేశారన్న ఆరోపణలు వచ్చాయి. టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో.. ఇలా నియామకాలన్నీ ఒకే సామాజిక వర్గంతో నడిచాయి. చైర్మన్లుగా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారు. ఎక్కడో కేంద్ర సర్వీసులో ఉన్న ధర్మారెడ్డిని తీసుకువచ్చి ఉన్నతాధికారిని చేశారు.టీటీడీ కీలక పదవులు, కొలువులన్నీ ఒకే సామాజిక వర్గానికి అప్పగించారని అప్పట్లో విపక్ష టిడిపి ఆరోపించింది. ఎల్లో మీడియా సైతం కథనాలు ప్రచురించింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు సర్కార్ అదే పరంపరను కొనసాగిస్తుందన్న టాక్ ప్రారంభమైంది. కమ్మ సామాజిక వర్గంతో నింపే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. టీటీడీ అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరి నియామకంతో.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గతంలో ఇదే మాదిరిగా జగన్ టీటీడీ అధికారిగా నియమించుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆయన అత్యంత సన్నిహితుడు. అందుకే జగన్ ఏరి కోరి ఆయన్ను తెచ్చుకున్నారు. ఇప్పుడు అడిషనల్ ఈవోగా నియమితులైన వెంకయ్య చౌదరి కూడా సీఎం చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ఒకవేళ టీటీడీ అధ్యక్ష పదవి కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తే.. జగన్ సర్కార్ పై వచ్చిన ఆరోపణలే చంద్రబాబు ప్రభుత్వం పై రావడం ఖాయం. కూటమి ప్రభుత్వానికి అది ఏమంత శ్రేయస్కరం కూడా కాదు.

* టీటీడీ అధ్యక్ష పదవి వారికే
టీటీడీ అధ్యక్షుడిగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం నేతల పేర్లు వినిపిస్తుండడం విశేషం. మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేశారు మురళీమోహన్. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం కోడలిని నిలబెట్టారు. 2024 ఎన్నికల్లో ఆ కుటుంబం అసలు పోటీ చేయలేదు. కానీ టిడిపికి మాత్రం మురళీమోహన్ మద్దతుగా నిలిచారు. తనకు టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తే గౌరవప్రదంగా రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు అవుతుందని చంద్రబాబుకు విన్నవించారు. దీనిపై చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారు.

* ఆ టీవీ ఛానల్ అధినేతకు
మరోవైపు టీవీ5 అధినేత నాయుడు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గత ఐదు సంవత్సరాలుగా టిడిపికి వెన్నుదన్నుగా నిలిచింది ఆ ఛానల్. సొంత మీడియా కంటే ఎక్కువగా అండగా నిలబడింది. అందుకే టీటీడీ అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని కోరుతున్నారు నాయుడు. దీనిపై కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. చాలామంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు సైతం టీటీడీ అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.

* వైసీపీ హయాంలో వారికే
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టిటిడి అధ్యక్ష పదవిని తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కే అప్పగించారు జగన్. మూడున్నర సంవత్సరాలు తర్వాత సుబ్బారెడ్డిని మార్చారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లు బలంగా వినిపించాయి. కానీ వారందరినీ కాదని అదే సామాజిక వర్గానికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డికి కేటాయించారు. దీంతో ఇది ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది విపక్షాలకు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తన సామాజిక వర్గంతో జగన్ నింపేశారని ప్రచారం చేశారు. అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు చంద్రబాబు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారుల నియామకంతో.. గతంలో టిడిపి చేసిన ప్రచారాన్ని తిప్పి కొట్టాలని వైసీపీ భావిస్తోంది. మేల్కొనకుంటే టిడిపి కూటమి ప్రభుత్వానికి ఇది ముప్పే.