Chandrababu: అమరావతి( Amravati capital ) భవిత పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎలా పూర్తి చేస్తాం? ఎలా నిధులు సమకూరుస్తున్నాం? అన్న విషయాలపై స్పష్టతనిచ్చారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, రాయలసీమలో బనకచర్ల ఆవశ్యకత గురించి వివరించారు. ఎలా సంపద సృష్టించబోతున్నాం? భూముల విలువ ఎలా పెంచబోతున్నాం? అన్న విషయాలపై కూడా సవివరంగా మాట్లాడారు. మంగళగిరిలో వే2 న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో చంద్రబాబు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రధానంగా అమరావతిపై అన్ని రకాల సందేహాలను నివృత్తి చేశారు సీఎం చంద్రబాబు.
Also Read: అప్పట్లో ‘కాంతారా’ ని ఎవ్వరూ కొనలేదు..ఇప్పుడు ‘కాంతారా 2’ ఎంతకి అమ్ముడుపోయిందంటే!
* అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్రణాళిక. దాదాపు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ నవ నగరాలు విస్తరించాలన్నది ప్లాన్. దీనిపై అనేక రకాల సందేహాలు ఉన్నాయి. అయితే దీనిపై మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం ఎలా అయ్యింది.. అన్నదానిపై స్పష్టతనిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, పక్కన 9 మున్సిపాలిటీలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి సైబరాబాద్ నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే అమరావతి లోను గుంటూరు, విజయవాడ, తెనాలి సహా పక్కన గ్రామాలన్నీ కలిస్తేనే మహానగరంగా తయారవుతుందని అభిప్రాయపడ్డారు. మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు చంద్రబాబు. ప్రధాని మోదీ తోనే రాజధానిని ప్రారంభిస్తామని కూడా చెప్పుకొచ్చారు.
* అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరుగుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు చంద్రబాబు. అది ఎలా సాధ్యమవుతుందో కూడా వివరించారు. హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టకముందు అక్కడ ఎకరా లక్ష రూపాయలు కూడా లేని విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు వందల కోట్లు పలుకుతున్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. పరిశ్రమలతో పాటు విద్యాసంస్థలు, రోడ్లు మౌలిక వసతులు కల్పిస్తే తప్పకుండా భూమి విలువ పెరుగుతుందన్నారు.
* టెక్నికల్ ఎడ్జ్ లో ఉన్న క్వాంటం వ్యాలీ కంప్యూటర్ అందుబాటులోకి తేవడం పై రకరకాల అనుమానాలు ఉన్నాయి. దీనిపై చంద్రబాబు మాట్లాడారు. అమరావతిలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటర్ పెట్టాలనుకున్నామని.. కానీ ఇప్పుడు అక్కడ కంప్యూటింగ్ పరికరాలు తయారు చేసే సత్తా సొంతమైందని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన కంపెనీలు వెల్లువలా అమరావతికి వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
* ఇంతటి ఆర్థిక ఇబ్బందుల్లో బనకచర్ల ప్రాజెక్టు అవసరమా అన్న ప్రశ్నకు.. తనదైన రీతిలో సమాధానం చెప్పారు సీఎం చంద్రబాబు. రాయలసీమలో అత్యంత దుర్భిక్ష ప్రాంతం అనంతపురం. అక్కడ వర్షపాతం నమోదు చాలా తక్కువ. అటువంటిది ఇప్పుడు సాగునీరు అందించేసరికి జి ఎస్ డి పి లో ప్రథమ స్థానంలో ఉంది. ఉద్యాన పంటల సాగు బాగుంది. అందుకే రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే బనకచర్ల కీలకం. అది ఎవరి నీటి వాటాతో కాదు.. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఒడిసిపెట్టి రాయలసీమకు తరలించాలన్నదే ప్రయత్నం. దానికి ఆర్థిక ఇబ్బందులు సర్వసాధారణం. సంపద సృష్టించాలంటే పెట్టుబడి పెట్టాలి. పారిశ్రామికవేత్తలు సొంత డబ్బు పెడుతున్నారా? బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి ఆదాయం సాధిస్తున్నారు. తిరిగి వాటిని చెల్లిస్తున్నారు. అలా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్పేంటి అని చంద్రబాబు ప్రశ్నించారు.
* టిడిపి కూటమి సర్కార్ ఒకవైపు క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్ హబ్, ఏరో స్పేస్ అని చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ లాంగ్ స్టాండింగ్ లో వచ్చే ఫలితాలు. దానిపైన స్పష్టతనిచ్చారు చంద్రబాబు. ఏవైనా పాలసీలు ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి ప్రతిబంధకాలు సర్వసాధారణం అని.. కచ్చితంగా భావితరాల కోసం రిస్క్ చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టతనిచ్చారు. మొత్తానికి అయితే చాలా విషయాలపై తన మనసులో ఉన్న అభిప్రాయాలను నిర్మోహమాటంగా బయటపెట్టారు చంద్రబాబు.