Chandrababu Naidu : నేతల పర్యటనలు, ఎన్నికల ప్రచారాల్లో అనేక ఆసక్తికర పరిణామాలు జరుగుతుంటాయి. అవి నేతల మైలేజ్ ను పెంచే విధంగా ఉంటాయి. అందునా సోషల్ మీడియా వచ్చిన తరువాత ఈ తరహా చర్యలు పెరిగిపోయాయి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ పేరిట కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. వాటిని ప్రచార ఆర్భాటంగా విపక్షాలు కొట్టి పారేస్తుంటాయి. తాజాగా మాజీ సీఎం చంద్రబాబు అటువంటి ప్రచారానికి చిక్కడం గమనార్హం. రోడ్డుపక్కన టీ దుకాణం నడుపుతున్న కుటుంబానికి ఏకంగా రూ.10 వేలు అందించి చంద్రబాబు అందర్నీ ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. విజయనగరం పర్యటనను ముగించుకొని అనకాపల్లి వెళుతున్న క్రమంలో రోడ్డు పక్కన తన కాన్వాయ్ ని ఆపించారు. పక్కనే ఉన్న ఓ టీ దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడున్న మహిళను అప్యాయంగా పలకరించారు. అక్కడే టీ తాగుతూ మహిళ కుటుంబ విషయాలను అడిగారు. దీంతో టీ షాపు నిర్వాహకురాలు శివమ్మ.. ఆమె కుమార్తె యశస్విలు కలిసి చంద్రబాబుతో మాట్లాడారు. తాము కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నామని.. ఇంటి స్థలం మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
చంద్రబాబు అక్కడితో ఆగకుండా ఆమె కుమార్తె విషయం ఆరాతీశారు.యశస్విని ఇంటర్ చదువుతుందన్న విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు.. ఎలా చదువుతున్నావంటూ ఆమె చదువుకు సంబంధించిన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. చివర్లో వెళుతూ.. ఇంటర్ చదువుతున్న యశస్వికి ప్రోత్సాహకంగా తన వ్యక్తిగత డబ్బుల్లో రూ10వేల మొత్తాన్ని ఆమె చేతికి ఇచ్చారు. ఉన్నత చదువుల కోసం ప్రోత్సహకంగా తానీ మొత్తాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు స్థాయి వ్యక్తి తమ టీ దుకాణానికి వచ్చి రూ.10వేలు ప్రోత్సాహకంగా ఇవ్వటంతో ఆ కుటుంబం ఉబ్బితబ్బివుతోంది.