CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని.. ప్రజల ఆంక్షలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుందామని పిలుపునిచ్చారు. కూటమికి తలవొంపులు తెచ్చేలా ఎవరు వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు.డిప్యూటీ సీఎం పవన్ సైతం మనపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉందామని ఎమ్మెల్యేలకు సూచించారు. తాను తప్పు చేసిన చర్యలు తీసుకోవాలని సభాముఖంగానే కోరారు పవన్ కళ్యాణ్.అయితే కొంతమంది ఎమ్మెల్యేలు,మంత్రుల వ్యవహార శైలి భిన్నంగా ఉంటోంది. వారి కుటుంబ సభ్యులు సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తల వంపులు తప్పేలా లేవు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రి భార్య అయితే.. తనకు ఎస్కార్ట్ పోలీసుల వాహనం కావాలని పట్టు పట్టారు.పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పెద్ద వివాదమే నడిచింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సీఎం చంద్రబాబు వరకు వెళ్లడంతో ఆయన మందలించారు. మరోసారి ఆ ఘటన పునరావృత్తం కాకూడదని ఆదేశాలు ఇచ్చారు. దానిపై సదరు మంత్రి సంజాయిషీ ఇచ్చారు. మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చారు.
* మీడియాపై ఎమ్మెల్యే చిందులు
నిన్నటికి నిన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏకంగా మీడియానే బెదిరించారు. టిడిపికి అనుకూల మీడియా గా ఉండే ఈనాడు విలేఖరికి ఫోన్లో తీవ్రస్థాయిలో హెచ్చరికలు పంపారు.ఇసుక మాఫియా వార్తలు రాయడమే ఇందుకు కారణం. అయితే దీనిపై ఈనాడు సమగ్ర కథనం రాసింది. బొజ్జల సుధీర్ రెడ్డిని తప్పుపడుతూ రాసిన ఈ కథనం పై సీఎం చంద్రబాబు స్పందించారు.ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఏకంగా టిడిపికి అనుకూలంగా ఉండే మీడియాని బెదిరించడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
* ఎమ్మెల్యే భర్త బెదిరింపులు
తాజాగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి భర్త రామచంద్రరావు పై ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు.నా భార్య ఎమ్మెల్యే.. నేను కోరినట్లుగా నాలుగు ఎకరాలు 30 లక్షల రూపాయలకు అమ్మేయ్. లేకుంటే తరువాత పరిణామాలు సీరియస్ గా ఉంటాయి అంటూ ఆయన హెచ్చరించారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే భర్త నుంచి తనకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేయడం టిడిపి వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. గతంలో రామచంద్రరావుకు కొంత మొత్తం భూమి అమ్మానని.. ఇప్పుడు మిగతా భూమిని కూడా అమ్మకం చేయాలని బలవంతం పెడుతున్నట్లు బాధితుడు చెబుతున్నాడు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొస్తున్నాడు.
* ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు జాగ్రత్తగానే
అయితే జనసేన తో పాటు బిజెపి ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉన్నారు. కానీ టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇప్పుడు బయటపడుతోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు పొంచి ఉండడంతో నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల వ్యవహార శైలి చిక్కులు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. మరి చంద్రబాబు వారిని ఎలా అదుపులో పెట్టుకుంటారో చూడాలి.