CM Chandhrababu : టిడిపి రాజ్యసభ పై ఫోకస్ పెట్టిందా? అక్కడ బలం పెంచుకోవాలని చూస్తుందా? అందుకే ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తుందా? వైసిపి ఎంపీలను తమ వైపు తిప్పుకోనుందా? వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు ప్లాన్ చేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టిడిపిలోకి చాలామంది ఎమ్మెల్సీలు ఫిరాయించారు. అటువంటి వారిపై అనర్హత వేటు పడింది. ఇప్పుడు ఉప ఎన్నికలు రానున్నాయి. అందులో భాగంగానే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కి ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, ఇక్బాల్ టిడిపిలోకి వచ్చారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వారిని తిరిగి ఎమ్మెల్సీలను చేసింది. శాసనమండలిలోకి పంపించింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఒడిస్సా లో బిజెపి అనుసరించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిస్సాలో బిజెపి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో బిజెపికి తగినంత ప్రాతినిధ్యం లేకపోవడంతో.. ఒడిస్సాలో బిజేడి రాజ్యసభ సభ్యురాలిని తన వైపు తిప్పుకుంది బిజెపి. ఆమెతో రాజీనామా చేయించి.. వచ్చే ఉప ఎన్నికల్లో ఆమెనే బిజెపి తరఫున రాజ్యసభకు పంపనుంది. ఇప్పుడు ఏపీలో టిడిపి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా ఆరుగురు వైసిపి రాజ్యసభ సభ్యులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. వారిని ఎలాగైనా తన వైపు తిప్పుకొని రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఉప ఎన్నికకు తెర తీసి వారినే టిడిపి సభ్యులుగా గెలిపించుకొని రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ సాక్షి మీడియాలో సైతం ప్రత్యేక కథనం రావడం విశేషం.
* టిడిపికి ఆ లోటు
రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేదు. చివరిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కనకమెడల రవీంద్ర పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఎన్నికల్లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టిడిపికి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం లోటే. లోక్ సభలో తన బలంతో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడినా.. రాజ్యసభలో మాత్రం 11 స్థానాలతో వైసిపి పటిష్ట స్థితిలో ఉంది. దీంతో వైసీపీ వైపు బీజేపీ చూడక తప్పదు. అదే తనకు ప్రతిబంధకంగా మారుతోందని చంద్రబాబు భావిస్తున్నారు. రాజ్యసభలో సైతం పై చేయి సాధించాలని చూస్తున్నారు.
* ఆ ఇద్దరూ తప్పిస్తే
ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో.. విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి జగన్ కు అత్యంత నమ్మకస్తులు. మిగతావారు అనామకులు. రకరకాల సమీకరణలతో వారికి జగన్ చాన్స్ ఇచ్చారు. అయితే వారికి తగినంత స్వేచ్ఛ లేదు. గత ఐదేళ్లుగా సైతం రాజ్యసభ సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా జగన్ మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వారిలో సైతం అసంతృప్తి ఉంది. రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వారు తప్పకుండా అధికార పార్టీని ఆశ్రయిస్తారు. అటువంటి వారిని ఆకర్షించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది.
* బిజెపి సహకారం
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభలో బలం పెంచుకోవాలన్నది బిజెపి వ్యూహం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల బలం కూడా పెరగాలన్నది ఒక ఆలోచన. టిడిపి కూటమి వైపు వైసీపీ రాజ్యసభ సభ్యులు వస్తే.. వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. కచ్చితంగా దీనికి కేంద్ర పెద్దల సహకారం ఉంటుంది. రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలకు.. అదే పదవులు ఇవ్వడమో.. ఎమ్మెల్సీలతో పాటు నామినేటెడ్ పదవులు కేటాయించడం చేస్తామని హామీ ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు సాక్షిలో చంద్రబాబు ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రత్యేక కథనం రావడం విశేషం. తప్పకుండా వైసిపి ఎంపీలు టిడిపిలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.